High Court of Telangana| Photo Credits: Wikimedia Commons

Hyd, Dec 8: కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2016లో జారీచేసిన జీవో 16ను అమలుచేయాలని హైకోర్టు (High Court) మంగళవారం తీర్పునిచ్చింది. జీవో 16ను సవాల్‌చేస్తూ దాఖలైన ఇంప్లీడ్‌ పిటిషన్‌ కొట్టివేసింది. ఒక రిట్‌ను కొట్టేసిన విషయాన్ని దాచడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. పిటిషనర్లకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది. హైకోర్టు తీర్పుపై వివిధ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘాలు హర్షం ప్రకటించాయి.

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లను క్రమబద్ధీకరించేందుకు (services of contract employees) తెలంగాణ ప్రభుత్వం (Telangana government ) 2016 ఫిబ్రవరి 26న జీవో 16 జారీచేసింది. 2014 జూన్‌ రెండుకు ముందు పూర్తిస్థాయి కాంట్రాక్ట్‌ పద్ధతిలో నెలవారీ పారితోషికం పొందుతున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ఆ జీవోలో మార్గదర్శకాలు పొందుపరిచారు. ఆ జీవోను వ్యతిరేకిస్తూ నక్కల గోవింద్‌రెడ్డి, జే శంకర్‌ 2017లో పిల్‌ను దాఖలుచేశారు.

ఇదే కేసులో ఇంటర్‌విద్యలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులు సైతం ఇంప్లీడ్‌ అయ్యారు. ఈ వ్యాజ్యాలను 2021 ఫిబ్రవరిలో అప్పటి చీఫ్‌ జస్టిస్‌ హిమాకోహ్లీ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ విచారణ సమయంలో, కాంట్రాక్టు ఉద్యోగులుగా చేయని వాళ్లు జీవో 16ను ఎలా సవాల్‌ చేస్తారని ప్రశ్నించింది. 2016లో దాఖలు చేసిన రిట్‌ను డిస్మిస్‌ చేస్తూ తీర్పు చెప్పింది. ఈ విషయం మంగళవారం విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్రశర్మ, న్యాయమూర్తి జస్టిస్‌ తుకారాంజీల ధర్మాసనం దృష్టికి వచ్చింది.

తెలంగాణలో కొత్తగా 203 కరోనా కేసులు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 87 కొత్త కేసులు నమోదు

జీవో 16ను సవాల్‌ చేస్తూ పిటిషనర్లు రెండు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలుసుకున్న హైకోర్టు పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక రిట్‌ను కొట్టేస్తూ తీర్పు చెప్పిన విషయాన్ని గోప్యంగా ఉంచి అప్పటికే దాఖలు చేసిన మరో వ్యాజ్యంపై విచారణ జరిగేలా చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. పిల్స్‌లో ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే లక్ష రూపాయలు తక్కువ కాకుండా జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

దీంతో పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌ సత్యంరెడ్డి కల్పించుకొని తొలి వ్యాజ్యం దాఖలు చేసిన సమాచారం తనకు తెలియదని, రెండో వ్యాజ్యం వేసినవాళ్లు నిరుద్యోగులని, జరిమానా లేకుండా వదిలిపెట్టాలని కోరారు. పిటిషనర్లు నిరుద్యోగులు కాబట్టి వెయ్యి రూపాయలు చొప్పున మాత్రమే జరిమానా విధిస్తున్నట్టు ధర్మాసనం స్పష్టంచేసింది. జరిమానాను ప్రధాన మంత్రి కొవిడ్‌ సహాయ నిధికి చెల్లించాలని ఉత్తర్వులు జారీచేసింది. రెండో పిటిషన్‌ను కూడా కొట్టేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. తాజా తీర్పుననుసరించి, ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయాల్సి ఉన్నది.