Telangana: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అవాస్తవం, ప్రభుత్వం బలవంతంగా నన్ను సెలవుపై పంపించలేదు, కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ మహేందర్ రెడ్డి
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని డీజీపీ స్పష్టం చేశారు. ఇటీవల తన ఇంట్లో తాను జారిపడటంతో ఎడమ భుజానికి గాయమైందని డీజీపీ తెలిపారు.
Hyd, Mar 3: నను రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించిందని రేవంత్ చేసిన ఆరోపణలపై డీజీపీ మహేందర్ రెడ్డి (DGP Mahendar Reddy) స్పందించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని డీజీపీ స్పష్టం చేశారు. ఇటీవల తన ఇంట్లో తాను జారిపడటంతో ఎడమ భుజానికి గాయమైందని డీజీపీ తెలిపారు. భుజం పైన మూడు చోట్ల ఫ్యాక్చర్స్ అయినట్లు ఎక్స్ రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ రిపోర్టులలో తేలింది.
దీంతో భుజం కదలకుండా కట్టు కట్టారు వైద్యులు. దీంతో విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4వ తేదీ వరకు సెలవులో ఉన్నారు. వైద్యుల సలహా మేరకు విధుల్లో చేరడం జరుగుతుందన్నారు డీజీపీ. భుజానికి అవసరమైన వ్యాయామం, ఫిజియోథెరపీ, మందులను వాడడం జరుగుతోందని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.వాస్తవాలు తెలుసుకోకుండా తనను ప్రభుత్వం బలవంతంగా సెలవులో పంపించిందంటూ రేవంత్ రెడ్డి (TPCC president A Revanth Reddy) తప్పుడు ప్రచారం చేయడంపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక రాష్ట్ర పార్టీ నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేయడం భావ్యం కాదు.
తమ రాజకీయ అవసరాలకు ప్రభుత్వ అధికారులపై ఈవిధమైన అసత్య ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని డీజీపీ పేర్కొన్నారు. ఒక ఉన్నత స్థాయిలో, బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న సీనియర్ అధికారిపై ఈ విధమైన ఆరోపణలను చేయడం ఆక్షేపణీయమే కాకుండా ప్రభుత్వంపై అపోహలు కలిగే అవకాశం ఉందన్నారు.