Rahul Gandhi Road Show: టీ కాంగ్‌లో రాహుల్ టూర్ జోష్, తెలంగాణలో రెండోరోజు రాహుల్ రోడ్ షో షెడ్యూల్ ఇదీ! భూపాలపల్లి నుంచి కరీంనగర్ వరకు సాగనున్న బస్సుయాత్ర
కాటారంలో వరదల కారణంగా నష్టపోయిన రైతులతో రాహుల్ సమావేశం అవుతారు. రైతులకోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసే పథకాలను వారికి వివరిస్తారు. రుణమాఫీ, రైతులకు రూ.15వేలు పెట్టుబడి సాయం, రైతు కూలీలకు 12వేల సాయం, మద్దతు ధర, ఇతర పథకాల గురించి రాహుల్ రైతులకు తెలియజేయనున్నారు.
Hyderabad, OCT 19: అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ (Congress) అడుగులు వేస్తోంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీలు (Priyanka Gandhi) బుధవారం ములుగు జిల్లా రామప్ప దేవాలయం నుంచి కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్రను ప్రారంభించారు. అనంతరం రామాంజాపూర్ గ్రామంలో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాళేశ్వరం పేరిట రూ.లక్ష కోట్ల దోపిడీ జరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామని రాహుల్, ప్రియాంకలు తెలిపారు.
తెలంగాణలో రెండో రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతుంది. ఇవాళ భూపాలపల్లి (Bhupalapally) నుంచి కరీంనగర్ వరకు బస్సు యాత్ర కొనసాగుతుంది. రాహుల్ రోడ్ షో చేస్తూ పలు ప్రాంతాల్లో కార్నర్ మీటింగ్ లలో పాల్గోనున్నారు. తొలుత భూపాలపల్లి నుంచి కాటారం వరకు బస్సు యాత్ర ప్రారంభం కానుండగా.. కాటారంలో వరదల కారణంగా నష్టపోయిన రైతులతో రాహుల్ సమావేశం అవుతారు. రైతులకోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసే పథకాలను వారికి వివరిస్తారు. రుణమాఫీ, రైతులకు రూ.15వేలు పెట్టుబడి సాయం, రైతు కూలీలకు 12వేల సాయం, మద్దతు ధర, ఇతర పథకాల గురించి రాహుల్ రైతులకు తెలియజేయనున్నారు. అనంతరం అక్కడే రైతులతో కలిసి రాహుల్ గాంధీ భోజనం చేస్తారు.
రైతులతో సమావేశం తరువాత రోడ్ షో (Rahul Road Show) ద్వారా రాహుల్ గాంధీ మంథనికి వెళ్తారు. అక్కడ కాళేశ్వరం ముంపు బాధితులతో సమావేశం అవుతారు. అనంతరం మంథనిలో రోడ్ షో చేస్తూ సెంటినరీ కాలనీకి వెళ్తారు. అక్కడ సింగరేణి అతిథి గృహం వద్ద సింగరేణి కార్మికులతో రాహుల్ భేటీ అవుతారు. కార్మికులతో చర్చల తరువాత బస్సు యాత్ర కొనసాగిస్తారు. ఈ క్రమంలో కమాన్ పూర్ క్రాస్ రోడ్ వద్ద కార్నర్ మీటింగ్ లో రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4గంటలకు పెద్దపల్లిలోని జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. రాత్రి 7గంటల నుంచి 9 గంటల వరకు కరీంనగర్ లో పాదయాత్ర, కార్నర్ మీటింగ్ లో రాహుల్ పాల్గొంటారు.