Telangana Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, తొలివిడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ, గ్రూప్-1లో 503 పోస్టుల భర్తీకి అనుమతి..
ఉద్యోగాల భర్తీకి సంబంధించి తదుపరి ప్రక్రియకు సంబంధించి నియామక సంస్థలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్, మార్చ్ 23: సీఎం కేసీఆర్ ప్రకటించిన మొత్తం 80,039 ఉద్యోగాలకు గాను తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ బుధవారం ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి తదుపరి ప్రక్రియకు సంబంధించి నియామక సంస్థలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ (kcr) కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి (sabitha indra reddy) , శ్రీనివాస్‌గౌడ్ (srinivas goud) సభ్యులుగా ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు (harish rao) నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం.. సీఎస్ సోమేశ్ కుమార్ (somesh kumar) , ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అధికారులతో పలు దఫాలుగా చర్చించింది. దీనిలో భాగంగా తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గూగుల్ యూజర్లకు బంఫర్ న్యూస్, చివరి 15 నిమిషాల సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి
గ్రూప్-1లో 503 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఆర్ధిక శాఖ అనుమతించింది. అలాగే పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా జైళ్లశాఖలో 154 పోస్టులు, పోలీసు శాఖలో 16,587 పోస్టులు భర్తీ చేయనున్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా జైళ్లశాఖలో 31 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, వైద్యారోగ్యశాఖలో 2,662 పోస్టులు, డిప్యూటీ కలెక్టర్- 42, డీఎస్పీలు-91, ఎంపీడీవో-121, వైద్యారోగ్యశాఖ పాలనాధికారులు -20, వాణిజ్య పన్నులశాఖలో 48, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ -38, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్-40 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఆర్థికశాఖ తాజాగా విడుదల చేసింది. దీనికి అనుగుణంగా టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆయా శాఖల మంత్రులు, అధికారులతో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు చర్చించి మిగిలిన ఉద్యోగాలకు అనుమతి ఇవ్వనున్నారు.
కాగా.. కొద్దిరోజుల క్రితం అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో తక్షణమే 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 91,142 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని చెప్పిన కేసీఆర్.. వారికి శుభవార్త అందించారు. మొత్తం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తున్నట్టుగా కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.