Telangana Floods: జల దిగ్బంధంలో చిక్కుకున్న తెలంగాణ, నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ, వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు
గడిచిన 24 గంటల్లో పలు జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో 10 సెంటీ మీటర్లకు పైగా వర్షం కురిసింది. శని, ఆదివారాలలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం (IMD warns heavy rainfall) ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Hyderabad, July 24: అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు (Telangana Floods) కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో పలు జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో 10 సెంటీ మీటర్లకు పైగా వర్షం కురిసింది. శని, ఆదివారాలలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం (IMD warns heavy rainfall) ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం బలపడి శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్నది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
రాగల 24 గంటల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తేలిక పాటి నుంచి ఒక మాదిరి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.
నిన్న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడిలో 36.15, ఆసిఫాబాద్‌లో 31.48, నల్లగొండ జిల్లా గుండ్లపల్లి మండలం యర్రారంలో 25.10, జగిత్యాల జిల్లా రాయికల్‌లో 23.05, వరంగల్ రూరల్ జిల్లా నడికుడలో 21.10 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షం కురిసింది.ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి వద్ద ఉన్న బొగత జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో శుక్రవారం నుంచి రెండురోజులపాటు సందర్శనను నిలిపివేశారు. పర్యాటకులు ఎవరూ వెళ్లకుండా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకొన్నారు.
Here's Some visuals of Telangana Floods
భూపాలపల్లి మేడిగడ్డ బ్యారేజీ 79 గేట్లను అధికారులు ఎత్తివేశారు. మేడిగడ్డ బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11,09,640 క్యూసెక్కులకు చేరుకుంది. బ్యారేజీ పూర్తి నీటినిల్వ 16.17 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 11.40 టీఎంసీలకు చేరుకుంది. అన్నారం బ్యారేజీ 62 గేట్లును ఎత్తివేశారు. అన్నారం బ్యారేజీ ఇన్ ఫ్లో 5,43,125 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 5,71,365 క్యూసెక్కులు. బ్యారేజీ పూర్తి నీటినిల్వ 10.87 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.01 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతోంది. సాగర్ ఇన్ ఫ్లో 23,825 క్యూసెక్కులు కాగా... ఔట్ ఫ్లో 2,677 క్యూసెక్కులకు చేరుకుంది. సాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుతం 536.40 అడుగులకు చేరుకుంది. సాగర్ పూర్తి నీటినిల్వ 312 టీఎంసీలు, ప్రస్తుతం 181.9102 టీఎంసీలకు చేరుకుంది.
Some visuals of Telangana Floods
మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్ట్ 35 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో 3.89 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 3.75 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటినిల్వ 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 15.8069 టీఎంసీలుగా ఉంది. నిర్మల్ బైంసాలోని గడ్డెన వాగు ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గడ్డెన వాగు ఇన్ ఫ్లో 4,600 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 7,100 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 358.7 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 358 అడుగులుగా ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ఉప్పొంగుతోంది. ఈ క్రమంలో పర్ణశాలలో స్వామివారి నార చీరల ప్రాంతం పూర్తిగా నీటమునిగింది. అంతేకాదు.. సీతమ్మ వారి విగ్రహం, స్వామివారి సింహాసనం కూడా మునిగిపోయాయి. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 42.5 అడుగులకు చేరింది. 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు. అప్రమత్తమైన అధికారులు భద్రాచలంలోని లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
కుండపోత వానతో అతలాకుతలమైన పలు జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. వరదల కారణంగా తీవ్రంగా ధ్వంసమైన కరెంటు వ్యవస్థకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. పలు ప్రాంతాల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్న పలువురిని ఎన్డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందాలు, పోలీసులు సురక్షితంగా కాపాడారు.
వరదల్లో చిక్కుకున్న బాధితులకు సహాయం చేసేందుకు పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులు వస్తున్నారని, ఆందోళన చెందవద్దని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి శుక్రవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏదైనా సమస్య ఉంటే వెంటనే దగ్గరలోని పురావాస కేంద్రాలకు వెళ్లాలని, అత్యవసరమైతే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. భైంసా పట్టణంలో పోలీసులు చేస్తున్న సహాయక చర్యల వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Here's DGP TELANGANA POLICE Tweet
చేపల వేటకు వెళ్లి ఖమ్మం జిల్లా కల్లూరు మండలం గోవరం పంచాయతీ పరిధిలోని కనుగుల చెరువులోపడి చట్టుబోయిన మహేష్ (25) మృతిచెందాడు. నిర్మల్ మండలంలోని రాణాపూర్‌కు చెందిన ఆడె గణేశ్ (30) మంజులాపూర్ వద్ద రోడ్డుపై వరదలో చేపలు పట్టేందుకు వెళ్లి కాలువ గుంతలో పడి చనిపోయాడు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్దనపల్లి వాగులో గల్లంతైన సండ్రల్‌పాడ్‌కు చెందిన బర్రెల కాపరి లచ్చులు మృతదేహం లభ్యమైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీస్టేషన్‌లో పనిచేసే హోంగార్డు కొరెంగ భీంరావ్ రాత్రి కాగజ్‌నగర్ వాద్ద వాగులో మునిగి చనిపోయాడు.
ఎస్సారెస్పీ దిగువన నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావెల్ సమీపంలో గోదావరి తీరాన ఉన్న సాంబయ్య ఆశ్రమంలో చిక్కుకున్న ఏడుగురు స్వాములను ఎన్డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందం రక్షించింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లిలో వరదలో చిక్కుకున్న 9మందిని పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. కోటపల్లి మండలం దేవులవాడ సమీపంలోని పంప్‌హౌస్‌లో చిక్కుకున్న ముగ్గురిని పోలీసులు రక్షించారు. కుమ్రంభీంఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖనర్గాం వెళ్లేమార్గంలోని దుబ్బగూడెం వద్ద రెండువాగుల మధ్యలో చిక్కుకున్న 40మందిని ఒడ్డు కు చేర్చారు.
పెంచికల్‌పేట్, దహెగాం మండలాల పెద్దవాగుపై నిర్మిస్తున్న వంతెన వద్ద 9 మంది కార్మికులను ట్యూబులు, తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్కాపూర్ శివారులోని వరద నీటిలో చిక్కుకున్న ఇటుక బట్టీల కార్మికులను సింగరేణి రెస్క్యూటీం, పోలీసుల సహాయంతో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్వయంగా రంగంలోకి దిగి రక్షించారు. పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి తీరంలోని గౌతమేశ్వరస్వామి ఆలయ ఆవరణలో నివసించే మూడు అర్చక కుటుంబాలు, మత్స్యకారులు, భక్తులు 33 మందిని సింగరేణి ఆర్జీ-2కు చెందిన రెస్క్యూ టీంను కాపాడింది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట సమీపంలోని మగ్ధుంపుర వాగు సమీపంలో చిక్కుకున్న నెక్కొండ మండలం ముదిగొండకు చెందిన గర్భిణిని గ్రామ యువకులు వాగు దాటించారు.