Telangana Formation Day 2022: దేశంలో మత పిచ్చి తప్పవేరే చర్చ లేదు, దేశం కోలుకోవడానికి మరో వందేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు, కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడిన సీఎం కేసీఆర్
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం... కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ పట్ల బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (CM K Chandrashekhar Rao) ఆక్షేపించారు.
Hyd, June 2: నగరంలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో (Telangana Formation Day 2022) ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం... కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ పట్ల బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (CM K Chandrashekhar Rao) ఆక్షేపించారు. ఇప్పుడు దేశం ప్రమాదకరస్థితిలో ఉంది. విద్వేష రాజకీయాల్లో చిక్కి దేశం విలవిల్లాడుతోంది. దేశంలో మత పిచ్చి తప్పవేరే చర్చ లేదు. విచ్ఛిన్నకర శక్తులు ఇలాగే పేట్రేగిపోతే.. సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుంది. అశాంతి ఇలాగే ఉంటే అంతర్జాతీయ పెట్టుబడులు రావు. దేశం కోలుకోవడానికి మరో వందేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు. దేశ ప్రజలకు కావాల్సింది.. కరెంట్, మంచినీళ్లు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి.
ప్రగతి పథంలో దేశం పరుగులు పెట్టాలంటే.. నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలి. కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎజెండా కోసం దారులు వెతకాలి. దేశానికి ఒక సామూహిక లక్ష్యం లేకుండా పోయింది. దేశాన్ని నడిపించడంలో వైఫల్యం ఎవరిది?. కాఐదేళ్లకొకసారి జరిగే అధికార మార్పిడి ముఖ్యం కాదు.. సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలి. దేశానికి నూతన గమ్యాన్నినిర్వహించాలి.. గుణాత్మక మార్పు రావాలి అని తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు .
రాష్ట్ర హక్కుల సాధన కోసం కేంద్రంతో పోరాడాల్సి వస్తోంది. ప్రగతి శీల రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించడం లేదు. నిధులు కేటాయించాలని ప్రధాని మోదీని కోరినా ప్రయోజనం శూన్యం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు ఇవ్వడం లేదు. పన్ను మినహాయింపు లాంటి ప్రోత్సహాకాలు కూడా ఇవ్వడం లేదని అన్నారాయన. ఆఖరికి అత్యంత క్లిష్టమైన కరోనా సమయంలోనూ రాష్ట్రానికి కేంద్రం నయా పైసా సాయం అందించలేదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని అంశాలను బుట్ట దాఖలు చేయడంతో పాటు ఐటిఐఆర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారంటూ సంచలన ఆరోపణలకు దిగారు సీఎం కేసీఆర్.
న్యాయంగా రావాల్సిన నిధుల్లోనూ కేంద్రం కోత విధించిందని, ధాన్యం కొనుగోలు విషయంలోనూ కేంద్రం అన్యాయం చేసిందని అన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా ఢిల్లీలో నిరసన దీక్ష చేశాం. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని అవహేళన చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచాయి. రైతులను నిర్లక్ష్యం చేస్తే.. రోడ్డుపైకి వస్తారు. దేశవ్యాప్తంగా ఒకేవిధమైన కొనుగోలు విధానం ఉండాలి. రైతులతో చెలగాటమాడొద్దని కేంద్రానికి హితవు పలుకుతున్నా అన్నారు సీఎం కేసీఆర్.