16 New Front Organisations Bans: విరసంతో సహా 16 మావోయిస్ట్ సంస్థలపై ఏడాది పాటు నిషేధం, ఈ సంస్థలను చట్టవిరుద్ధ సంఘాలుగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, 30 మార్చి 2021 నుండి నిషేధం అమల్లోకి వస్తుందంటూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేష్ కుమార్
మావోయిస్టు పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న విరసంతో సహా 16 అనుబంధ సంఘాలపైనా (16 New Front Organisations Bans) వేటు వేసింది.
Hyderabad, April 24: నిషేధిత మావోయిస్టు పార్టీపై మరో ఏడాదిపాటు నిషేధం విధిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మావోయిస్టు పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న విరసంతో సహా 16 అనుబంధ సంఘాలపైనా (16 New Front Organisations Bans) వేటు వేసింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (Maoist)కు చెందిన 16 ఫ్రంట్ సంస్థలను చట్టవిరుద్ధ సంఘాలుగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం (TS Govt) వీటి కార్యకలాపాలపై ఏడాదిపాటు నిషేధం విధించింది. ఈ నిషేధం 30 మార్చి 2021 నుండి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది.
ఈ సంస్థలు హింస, బెదిరింపులకు పాల్పడటం కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ (CS Somesh KUmar) జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు. పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 1992 ప్రకారం ఈ నిషేధం కొనసాగుతుందని మార్చి 30న నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించింది.
వీటిల్లో తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్), తెలంగాణ అసంగటిత కార్మిక సాంఖ్య (టీఏకేఎస్), తెలంగాణ విద్యార్థి వేదికా (టీవీవీ), డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్(డీఎస్‌యూ), తెలంగాణ విద్యార్థి సంఘం (టీవీఎస్), ఆదివాసీ స్టూడెంట్స్ యూనియన్ (ఎఎస్‌యు), రాజకీయ ఖైదీల విడుదల కమిటీ (సీఆర్‌పీపీ), తెలంగాణ రైతాంగ సమితి, తుడుం దెబ్బా (టీడీ), ప్రజా కళా మండలి (పీకేఎం), తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ (టీడీఎఫ్), ఫోరమ్ ఎగైనెస్ట్ హిందూ ఫాసిజం అఫెన్సివ్ (ఫాఫ్ఫో), సివిల్ లిబర్టీస్ కమిటీ (సీఎల్‌సీ), అమరుల బంధు మిత్రుల సంఘం (ఏబీఎంఎస్), చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్), రివల్యూషనరీ రైటర్స్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యుఎ)- (విప్లవ రచయితల సంఘం-విరసం) ను చట్టవిరుద్ధమైన సంఘాలుగా ప్రభుత్వం పేర్కొంది.
ఈ 16 సంస్థలు ప్రజాసంఘాల ముసుగులో ప్రజల్లోకి వెళ్లి మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించింది.భీమా-కోరెగాం కేసు, ఉపా చట్టం కింద అరెస్టయిన విరసం నేత వరవరరావు, జీఎన్ సాయిబాబ, రోనా విల్సన్ తదితరులను విడుదల చేయాలంటూ ఈ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని తెలిపింది. ఇలాంటి చట్ట వ్యతిరేక సంఘాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు ప్రకటించింది.