దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తున్నారు.తాజాగా ఓ గొర్రెల కాపరి చేసిన ప్రయత్నం (‘Shepherd Bird Nest Mask) ఆయన్ని సోషల్ మీడియాలో స్టార్ ని చేసింది. ఆయన చేసిన పనికి అభినందనలు వెలువెత్తుతున్నాయి. ఇంతకీ అతను ఏం చేసాడో తెలుసా..పిచ్చుక గూడును మాస్క్ గా (Telangana's Mekala Kurmayya Wears 'A Bird-Nest as a Mask) ధరించి ప్రభుత్వ ఆఫీసుకు రావడం..
వివరాల్లోకెళితే.. మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం చిన్న మునగాల్ చేడ్ గ్రామానికి చెందిన పశువుల కాపరి మేకల కుర్మయ్య బుధవారం ముఖానికి మాస్కు ధరించాడు. చెట్లకు వేలాడే గిజిగాడి గూడును మాస్కులా ధరించాడు. దాన్ని ధరించి ఏకంగా గ్రామంలో పింఛన్ తీసుకొనేందుకు వచ్చాడు. ఇది చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.
మాస్కు గురించి గ్రామస్థులు అతణ్ని ప్రశ్నించగా.. పశువులను మేపడానికి వెళ్లిన సమయంలో పింఛన్లు ఇస్తున్నారని తెలిసి అక్కడి నుంచి నేరుగా వచ్చేశానని చెప్పాడు. మాస్కు లేకపోతే పింఛను ఇవ్వరని భావించి తన వద్ద మాస్కు లేకపోతే దారిలో కనిపించిన గిజిగాడి గూడును తీసుకుని మాస్కుగా పెట్టుకున్నానని చెప్పాడు. అయితే, చదువుకోకపోయినా కొవిడ్ నిబంధనను బాధ్యతగా వ్యవహరించాడని అతణ్ని అందరూ అభినందించారు. అయితే కుర్మయ్య ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ జర్నలిస్ట్ కుర్మయ్య ఫొటోను షేర్ చేశాడు.
Here's Shepherd With Bird Nest Mask
Mekala Kurmayya can’t buy a mask-still wore one. Kurmayya who hails from Chinnamunugal Chad in Mahabubnagar district #Telangana came to mandal center for a pension wearing a bird-nest as a mask! Not the best-but he tried. Govts should distribute masks for those who can’t afford pic.twitter.com/NogkmgNr5n
— Revathi (@revathitweets) April 22, 2021
దీనిపై నెటిజన్లు వివిధ రకాలు స్పందించారు. అతనికి మాస్కు కొనుక్కొనే స్తోమత లేక కొనుక్కోలేదేమో అని, ఇలాంటి వారి కోసం ప్రభుత్వమే మాస్కులు పంపిణీ చేయాలని ఒకరు కామెంట్ చేశారు. ఇంకొకరు గిజిగాడు గూడుకు బదులుగా ‘అతని భుజం మీదున్న కండువాను మాస్కులా వాడుకోవచ్చు కదా.. అనిట్వీట్ చేశారు. ఇంకో వ్యక్తి మాత్రం పిట్టగూడు పెట్టుకున్నాడంటే.. ఇది కేవలం సోషల్ మీడియా స్టంటేనంటూ రాసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఓ నెటిజన్ గొర్రెల కాపరికి సోషల్ మీడియా గురించి ఏం తెలుసని ప్రశ్నించాడు.
కాగా ఫేస్ మాస్క్‌లను ఉపయోగించడం తప్పనిసరి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల మొదట్లో ఉత్తర్వులు జారీ చేసింది. ఉల్లంఘించిన వారికి రూ .1000 జరిమానా విధించాలని ఆదేశించింది.