Coronavirus Outbreak: కరోనావైరస్ గురించి భయపడకండి, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం, ఎలాంటి వదంతులు, సోషల్ మీడియా దుష్ప్రచారాలు నమ్మవద్దు; ఆరోగ్యమంత్రి ఈటల రాజేంధర్

పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, కరోనావైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ప్రజలను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదే అని ఈటల స్పష్టం చేశారు. కరోనా రహిత తెలంగాణగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటల భరోసా ఇచ్చారు.....

Telangana Health Minister Etela Rajender | File Photo

Hyderabad, March 4: కరోనావైరస్ (Coronavirus) పట్ల ప్రజలు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఈటల రాజేంధర్ (Etela Rajender) విజ్ఞప్తి చేశారు. గతంలో వచ్చిన వైరస్ ల కంటే కరోనావైరస్ అంత తీవ్రమైనదేమి కాదు. ఈ వైరస్ సోకినంత మాత్రాన చనిపోతారనే వాదనలో నిజం లేదని స్పష్టం చేశారు. ఈ వైరస్ సోకినా కూడా 81 శాతం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగదు, కేవలం వయసు పైబడి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే 14 శాంతం మందికి మాత్రమే చికిత్స అవసరం అవుతుందని ఆయన వెల్లడించారు. కరోనాకు (COVID 19)  మనిషిని చంపే శక్తి లేదని వైద్యులే చెబుతున్నారు. శుభ్రత పాటించడం ద్వారా 99 శాతం వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చునని తెలిపారు.  తెలంగాణలో ఉండే పొడి వాతావరణంలో కరోనావైరస్ మనుగడ సాధించలేదు

ఈ వైరస్ సోకి తెలంగాణలో ఇప్పటివరకు ఒక్కరికే పాజిటివ్ వచ్చిందని, అతడితో వారం రోజుల పాటు గడిపిన రోగి కుటుంబ సభ్యులకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని మంత్రి తెలియజేశారు. ఇంట్లో వాళ్లకే వైరస్ సోకనపుడు, ఇక బయటివారికి ఎలా సోకుతుందని అన్నారు.

అలాగే ఈ వైరస్ గాలి ద్వారా సోకే అవకాశం లేదని, రోగికి దగ్గరగా ఉండటం వల్ల కూడా వచ్చే అవకాశం లేదు. కేవలం రోగి దగ్గడం, తుమ్మడం చేయడం ద్వారా వ్యాపిస్తుందని చెప్పారు. బహిరంగా ప్రదేశాలలో ఎవరైనా దగ్గడం, తుమ్మడం చేసేటపుడు చేతికి రుమాలు అడ్డుపెట్టుకోవాలని మంత్రి సూచించారు.

ఇక వైరస్ నియంత్రణ కోసం సిబ్బంది ప్రత్యేక దుస్తుల్లో కనిపించడం, మందులు చల్లడం చేస్తే దానిని చూసి కూడా భయపడటం దేనికని మంత్రి అన్నారు. మహేంద్రహిల్స్ లో గానీ, ఇంకెక్కడైనా గానీ స్కూళ్లను మూయాల్సిన అవసరం కూడా లేదని ఈటల పేర్కొన్నారు. కరోనావైరస్ ప్రభావంతో హైదరాబాద్ - మహేంద్రాహిల్స్ కాలనీలో స్కూళ్లకు సెలవులు

ఇలాంటి సమయంలో వదంతులు వ్యాప్తి చేయొద్దు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయకూడదు. ఇది మజాక్ కాదు, ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం అని మంత్రి అన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, కరోనావైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ప్రజలను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదే అని ఈటల స్పష్టం చేశారు. కరోనా రహిత తెలంగాణగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటల భరోసా ఇచ్చారు.