Coronavirus Scare: కరోనావైరస్ ప్రభావంతో హైదరాబాద్ - మహేంద్రాహిల్స్ కాలనీలో స్కూళ్లకు సెలవులు, మైండ్ స్పేస్ ఐటీ పార్క్ పాక్షికంగా మూసివేత
COVID 2019 Outbreak in India | PTI Photo

Hyderabad, March 4: హైదరాబాద్ నగరానికి కరోనావైరస్ భయం (Coronavirus Scare) పట్టుకుంది. ఇటీవల దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన 24 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (Techie) కి వైద్యపరీక్షల్లో కోవిడ్-19 పాజిటివ్ (COVID 19 Positive) అని నిర్ధారణ అవటం మరియు అతని ద్వారా మరికొంత మందికి వైరస్ సోకి ఉండవచ్చు అని అనుమానాలు తలెత్తడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ నివారణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది.

కరోనావైరస్ బాధితుడిది సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ పరిధిలో గల మహేంద్రహిల్స్ కావడంతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ఏరియా అంతా పారిశుధ్య పనులు చేపట్టారు, వీధుల గుండా బ్లీచింగ్ పౌడర్, డిసిన్ఫెక్టెంట్ స్ప్రేలు చల్లారు. బాధితుడి ఇంటి పరిసరాలు శుభ్రం చేశారు. ఆ ఏరియాలో ఒక ఆపార్ట్ మెంట్ మొత్తం ఖాళీ చేసినట్లు సమాచారం. కాలనీలో చాలా మంది కనీసం బయటకు రావడం లేదు, అందరూ స్వచ్ఛందంగా గృహ నిర్బంధంలో ఉన్నారు. కొంత మంది వేరే ప్రాంతాలకు తరలిపోవడం కనిపించింది. ముందు జాగ్రత్త చర్యగా మహేంద్రాహిల్స్ కాలనీలో పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి. దేశంలో 28 కరోనా కేసులు నమోదు, చికిత్స అనంతరం ముగ్గురి డిశ్చార్జి

కరోనావైరస్ సోకిన వ్యక్తి దుబాయ్ నుంచి బెంగళూరు మీదుగా ఫిబ్రవరి 22న హైదరాబాద్ వచ్చాడు. నెలరోజుల క్రితం దుబాయిలో హాంకాంగ్ కు చెందిన కంపెనీ ప్రతినిధులను కలవడం ద్వారా వారి నుంచి ఇతడికి వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. తిరిగి వచ్చిన తర్వాత బెంగళూరులో 2 రోజులు ఆఫీసుకు వెళ్లడంతో పాటు వైరస్ నిర్ధారణ అయి గాంధీ ఆసుపత్రిలో చేరేంత వరకు సుమారు వారం రోజుల పాటు కాలనీలోనే ఉన్నాడు. దీంతో అతడు ఎవరెవరిని కలిశాడు, ఎక్కడెక్కడ తిరిగాడు అని అధికారులు ఆరాతీస్తున్నారు.  హైదరాబాద్‌లో మరో 36 మందికి కరోనావైరస్ లక్షణాలు

ఇక కరోనావైరస్ ప్రభావంతో హైదరాబాద్ లోని మైండ్ స్పేస్ ఐటీ పార్క్ లోని రెండు భవనాలను తాత్కాలికంగా మూసివేశారు. ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' ఇచ్చి ఇంటి నుంచే పనిచేయాలని సూచించారు. విదేశీయులు ఎక్కువగా తిరిగే ప్రాంతం కావడంతో ఐటీ కారిడార్ పారిశుధ్యంపై కూడా అధికారులు దృష్టిపెట్టారు.