COVID-19 India Confirmed Cases: దేశంలో 28 కరోనా కేసులు నమోదు, చికిత్స అనంతరం ముగ్గురి డిశ్చార్జి, మీడియాకు వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం
Dr Harsh Vardhan | File Image | (Photo Credits: PTI)

New Delhi, Mar 04: ప్రపంచాన్ని వణికిస్తున్న కోరావైరస్ (coronavirus in India) ఇండియాలో కూడా మెల్లిగా తన ఉనికిని చాటుకుంటోంది. ఇప్పటిదాకా భారత దేశంలో మొత్తం 28 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ (Health minister Harsh Vardhan) వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి ఈ వివరాలను తెలియజేశారు.

15 మంది ఇటలీ పర్యాటకులకు కోవిడ్‌-19 వైరస్

ఈ 28 కేసుల్లో మూడు కేరళ రాష్ట్రంలో నమోదయ్యాయని, అయితే సదరు పేషెంట్లను చికిత్స అనంతరం డిశ్చార్జి చేశామని ఆయన తెలిపారు. కేరళకు చెందిన ముగ్గురు కరోనా పేషెంట్లు కోలుకున్నారని, అందుకే వారిని డిశ్చార్జి చేశామని స్పష్టంచేశారు.

ఆస్పత్రి డైరక్టర్‌ను కరోనా చంపేసింది

ఈ 28 మంది కరోనా (COVID-19) పీడితుల్లో 14మంది ఇటలీ దేశస్థులని చెప్పారు. వీరందరినీ చావ్లా ప్రాంతంలోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ)కి చెందిన ఐసోలేటెడ్ ఫెసిలిటీకి తరలించామన్నారు. మొత్తం 21మంది ఇటలీవాసులకు కరోనా పరీక్షలు చేయగా, వారిలో 14మందికి పాజిటివ్ ఫలితాలొచ్చాయని తెలిపారు.

12మంది భారతీయులు, 16మంది విదేశీయులకు కరోనా సోకిందని హర్షవర్థన్ చెప్పారు. భారత పర్యటనకు వచ్చిన 16మంది ఇటలీ దేశీయులకు కరోనా సోకినట్టు నిర్ధారించారు. 14మంది పర్యాటకులను తీసుకెళ్లిన డ్రైవర్ కు కూడా కరోనా సోకింది. ఢిల్లీలో 14మందికి, జైపూర్ లో ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు.

కరోనా కలవరం, హోలీ వేడుకలకు దూరంగా ప్రధాని మోదీ

కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో మాట్లాడారు. ఈ సంధర్భంగా మార్కెట్లో ఎన్‌–95 మాస్కుల రేట్లను పెంచడంపై మంత్రి దృష్టికి అధికారులు తీసుకుని వచ్చారు . అటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కరోనా చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు పంపిస్తామని ఆయన అన్నారు.

హైదరాబాద్‌లో మరో 36 మందికి కరోనావైరస్ లక్షణాలు?

ఢిల్లీలో కరోనా రోగి నుంచి మరో ఆరుగురికి కరోనా వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. ఆగ్రాలోని కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఆ ఆరుగురికి ఆగ్రా ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.ఇప్పటివరకు 80కుపైగా దేశాల్లో కరోనా వ్యాపించింది. 90వేల మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. 3వేల 500 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు.

మన దేశంలోనూ కరోనా విజృంభణతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశీ ప్రయాణాలపై కీలక సూచనలు చేసింది. పలు దేశాల నుంచి భారత్‌లోకి ప్రవేశించేవారిపై కఠిన అంక్షలు విధిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది.

మార్చి 3వ తేదీకి ముందు ఇటలీ, ఇరాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌ దేశస్థులకు జారీ చేసిన రెగ్యులర్‌, ఈ వీసాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అత్యవసర కారణాలతో భారత్‌ రావాలనుకునే వారు సమీపంలోని భారత ఎంబసీని సంప్రదించి కొత్త వీసాలను పొందాలని సూచించింది. చైనా దేశీయులకు ఫిబ్రవరి 5కు ముందు వరకు జారీ చేసిన రెగ్యులర్‌, ఈ వీసాలను తాత్కాలికంగా రద్దు చేసింది. ఆ నిర్ణయం ఇంకా కొనసాగుతుందని కొత్త నిబంధనల్లో వెల్లడించింది.

ఫిబ్రవరి 1 తర్వాత చైనా, ఇరాన్‌, ఇటలీ, దక్షిణ కొరియా, జపాన్‌ దేశాలకు వెళ్లిన విదేశీయుల రెగ్యులర్‌, ఈ వీసాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ జాబితాలో ఎవరైనా అత్యవసర కారణాలతో భారత్‌ రావాలనుకునేవారు సమీపంలోని భారత ఎంబసీని సంప్రదించి కొత్త వీసాలను పొందాలని సూచించింది.