TS Municipal Elections Update: మున్సిపల్‌ ఎన్నికలు నిలిపివేయలేమని తెలిపిన హైకోర్టు, లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని తేల్చి చెప్పిన ఈటల రాజేందర్, నోముల భగత్‌కు కరోనా

ఎన్నికలు రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ (Shabbir Ali) దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు (Telangana High Court) విచారణ చేపట్టింది.

High Court of Telangana | (Photo-ANI)

Hyderabad, April 19: తెలంగాణలో ఈనెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని (TS Municipolls Update)తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ (Shabbir Ali) దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు (Telangana High Court) విచారణ చేపట్టింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన కారణంగా నిలిపి వేయాలేమని హైకోర్టు వెల్లడించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ ఇచ్చిన అభ్యర్ధనను ఈసీ పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 7కు హైకోర్టు వాయిదా వేసింది.

ఎంజీఎంలో కోవిడ్ పేషేంట్స్ పారిపోయిన ఘటనపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. కొందరు రోగులు తెలిసి తెలియక పారిపోతున్నారని, ఒకరిద్దరూ పోయినంత మాత్రానా వైద్యం అందలేదన్న అపవాదు సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఎంజీఎంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాన్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక‌లో లాగా ఇక్కడ పరిస్థితి లేదని చెప్పారు. దూరపు కొండలు నునుపు అన్నట్టు మన దగ్గర అంత సీరియస్ పరిస్థితి లేదని కొట్టిపారేశారు. మన దగ్గర లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

సెకండ్ వేవ్ ఉధృతి.. కరోనా సోకిన 2-3 రోజుల్లోనే లక్షణాలు, తెలంగాణలో కొత్తగా 4,009 కోవిడ్ కేసులు నమోదు, సరిపడా వ్యాక్సిన్, ఆక్సిజన్ కేటాయించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి

టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల‌ భగత్‌‌తో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇతర టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకి కూడా కరోనా సోకింది. కాంగ్రెస్, బీజేపీ నేతలలో చాలా మంది కరోనా బారిన పడినట్టు సమాచారం. ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న పలువురు నేతలు హోమ్ క్వారంటైన్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. కార్యకర్తలకు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. నియోజకవర్గంలో మొత్తం ఇవాళ 160 కేసులు నమోదయ్యాయని రికార్డులు చెబుతున్నాయి.