Ganesh Chaturthi Guidelines: తెలంగాణలో గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనాలపై రాష్ట్ర హైకోర్ట్ ఆంక్షలు, హుస్సేన్ సాగర్‌లో పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం, కీలక ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం
రోడ్లకు అడ్డంగా గణేష్ మంటపాలను ఏర్పాటు చేయవద్దు, ఉత్సవాల్లో నిర్వహించే డిజే లాంటి కార్యక్రమాలపై నియంత్రణ ఉండాలి, రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి శబ్దాలు వినిపించకుండా చూడాలని పోలీస్ శాఖను హైకోర్ట్ ఆదేశించింది...
Hyderabad, September 9: తెలంగాణలో గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనాలపై రాష్ట్ర హైకోర్ట్ ఆంక్షలు విధించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పిఒపి) తో తయారు చేసిన గణేష్ విగ్రహాలను హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు గురువారం ఆదేశించింది. అలాంటి విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుంటలలోనే నిమజ్జనం చేయాలని సూచించింది. ఈ విషయంలో ప్రభుత్వం, పోలీసు శాఖ మరియు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) కోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
వినాయక చవితి మరియు దేవీ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో హుస్సేన్ సాగర్‌లో గణేష్ మరియు దుర్గామాత విగ్రహాల నిమజ్జనాన్ని నిలిపివేయాలని న్యాయవాది మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. వాదనలు పూర్తైన తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్ట్, ఈ మేరకు తీర్పు తాజాగా ప్రకటించింది.
ఇక పిఓపి కాని, పర్యావరణానికి హాని కలిగించని విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేసుకునేందుకు అనుమతించిన హైకోర్ట్, నిమజ్జన ప్రక్రియ ట్యాంక్ బండ్ మీదుగా కాకుండా పీవీ మార్గ్, సంజీవయ్య మార్గ్ వైపు నిమజ్జనం చేసుకోవాలని సూచించింది. అలాగే విగ్రహం పూర్తిగా మునిగేలా నిమజ్జనం చేయకూడదు, నిమజ్జనం తర్వాత కూడా ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించాలని హైకోర్ట్ పేర్కొంది. అలాగే కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు నిబంధనలను పాటించాలని, ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలి మరియు సుదూర ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ వైపు వచ్చే వారిని నిలువరించాలని హైకోర్ట్ సూచించింది.
ఇక, రోడ్లకు అడ్డంగా గణేష్ మంటపాలను ఏర్పాటు చేయవద్దు, ఉత్సవాల్లో నిర్వహించే డిజే లాంటి కార్యక్రమాలపై నియంత్రణ ఉండాలి, రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి శబ్దాలు వినిపించకుండా చూడాలని పోలీస్ శాఖను హైకోర్ట్ ఆదేశించింది.