Free Rice Distribution: గుడ్ న్యూస్, రేషన్‌ కార్డు దారులకు 10 కిలోల ఉచిత బియ్యం, నేటి నుంచి పంపిణీ ప్రక్రియ ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం

ఇకపై ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా యూనిట్‌కు పది కిలోల చొప్పున ఉచిత బియ్యం (Free Rice Distribution) పంపిణీ కానుంది.

Free Rice Distribution (Photo-Twitter)

Hyd, July 5: తెలంగాణలో ఆహార భద్రత (రేషన్‌) కార్డు కలిగిన కుటుంబాలకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఇకపై ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా యూనిట్‌కు పది కిలోల చొప్పున ఉచిత బియ్యం (Free Rice Distribution) పంపిణీ కానుంది. ఈ నెల ఐదు నుంచి ఉచిత బియ్యం కోటా పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి వెల్లడించారు. కరోనా నేపథ్యంలో పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం పంపిణీ మధ్యలో రెండు నెలలు నిలిచిపోగా, గత నెల చివర్లో నెలసరి కోటాతో సంబంధం లేకుండా యూనిట్‌కు ఐదు కిలోల చొప్పున ఉచితంగా ప్రభుత్వం (KCR Government) అందించింది.

ఈ నెలలో మాత్రం పాత పద్ధతిలోనే యూనిట్‌కు పది కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు. కార్డులో ఎన్ని యూనిట్లుంటే అన్ని పదికిలోల చొప్పన పంపిణీ చేస్తారు. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా నెలసరి ఉచిత కోటా ఈ నెల 29 వరకు డ్రా చేసుకోవచ్చు. కాగా కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం కింద ఉచిత బియ్యం కోటా కేటాయిస్తూ అమలు చేస్తోంది. ఆహార భద్రత కార్డులోని (Ration Card Holders) ప్రతి లబ్ధిదారుడికి ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం కోటా కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కిలోలు కలిపి పది కిలోల చొప్పున అందిస్తూ వస్తోంది.

హైదరాబాద్‌లో మరో పరువు హత్య... ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడని మామే పెట్రోల్ పోసి తగలబెట్టించాడు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నారాయణరెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్

అయితే ఉచితం బియ్యం పథకం కాలపరిమితి మార్చి కోటాతో ముగియడంతో కేంద్రం మరోసారి సెప్టెంబర్‌ వరకు ఈ పథకాన్ని పొడగించింది. అయితే ప్రభుత్వ చౌకధరల దుకణాల ద్వారా ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో ఉచిత బియ్యం పంపిణీ సాధ్యం కాలేదు. అయితే గత నెల చివర్లో మాత్రం నెలసరి కోటా పంపిణి గడువు ముగియగానే యూనిట్‌కు ఐదు కిలోల చొప్పున అందించింది. ఈ నెలలో మాత్రం పది కిలోల చొప్పున పంపిణీ చేయనుంది.