Honour killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య... ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడని మామే పెట్రోల్ పోసి తగలబెట్టించాడు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నారాయణరెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్
Image used for representational purpose only. | File Photo

Hyd, July 5: హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అదృశ్యమైన యువకుడు దారుణ హత్యకు గురయిన సంగతి విదితమే. దుండగులు చంపి అతనిపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. సగానికి పైగా కాలిన స్థితిలో ఉన్న శవాన్ని ( charred body found in Telangana) పోలీసులు ఆదివారం కనుగొన్నారు. ఇతన్ని ఏపీలోని ప్రకాశం జిల్లా పొదలకుంట్లపల్లికి చెందిన శనివారపు బాలిరెడ్డి కుమారుడు నారాయణ రెడ్డిగా (Software Engineer Narayan Reddy ) గుర్తించారు. తాజాగా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నారాయణరెడ్డి హత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ హత్యను పరువు హత్యగా (Honour killing) తేల్చారు.

తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్న నారాయణరెడ్డిని మామ వెంకటేశ్వర్ రెడ్డి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. కుమార్తె, అల్లుడికి ఘనంగా పెళ్లి చేస్తానంటూ ఇంటికి పిలిపించి కుమార్తెను గృహనిర్భందం చేశారు. ఈ క్రమంలో వేరే పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి చేయడంతో అందుకు ఆమె నిరాకరించింది. దీంతో తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న నారాయణ రెడ్డిని హత్య చేయాలని యువతి తండ్రి భావించాడు.

మధ్యప్రదేశ్‌లో దారుణం, పొలం కబ్జాను అడ్డుకున్నందుకు గిరిజన మహిళకు నిప్పటించారు, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మహిళ

ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ రెడ్డి, ఆశిక్, కాశీలకు వెంకటేశ్వరరెడ్డి ఐదు లక్షల సుపారీ ఇచ్చాడు. జూన్‌ 27న కేపీహెచ్‌బీ రూమ్‌ నుంచి నారాయణరెడ్డిని కారులో ఎక్కించుకొని మద్యంలో మత్తు మందు కలిపి టవల్‌తో మెడకు ఉచ్చుగా వేసి సుపారీ గ్యాంగ్‌ హత మార్చింది. అనంతరం జిన్నారం అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. ఈ ఘటనలో కాల్‌డేటా ఆధారంగా పోలీసులు నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువతి తండ్రి వెంకటేశ్వరరెడ్డిని గిద్దలూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు, నిందితులు ప్రకాశం జిల్లా పొదలకుంట్లపల్లికి చెందిన వారుగా గుర్తించారు.

ప్రేమ వ్యవహారం ?

కేపీహెచ్‌బీ, జిన్నారం సీఐలు కిషన్‌కుమార్, వేణు కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా పొదల కొండపల్లికి చెందిన శనివారపు బాలిరెడ్డి కుమారుడు నారాయణ రెడ్డి (25) ఓ ప్రైవేట్‌ సంస్థలో టెకీ ఉద్యోగం చేస్తూ కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్‌ ఒకటిలోని ఓ ఇంట్లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. గత నెల 27న రాత్రి 9 గంటల సమయంలో తాను శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తిని కలిసేందుకు వెళుతున్నట్లు చెప్పి బయటకు వెళ్లిన నారాయణరెడ్డి తిరిగిరాలేదు.

ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌ అయ్యింది. దీంతో అతని స్నేహితులు నారాయణరెడ్డి బావ వెంకటేశ్వరరెడ్డికి సమాచారం అందించారు. ఆయన గత నెల 30న కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదృశ్యం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు శ్రీనివాస్‌రెడ్డితో పాటు అతని గ్రామానికే చెందిన కారు డ్రైవర్‌ షేక్‌ ఆషిక్‌లపై నిఘా పెట్టారు. తర్వాత ఆషిక్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా నారాయణ రెడ్డిని హత్య చేసి సంగారెడ్డి జిల్లా జిన్నారం అటవీ ప్రాంతంలో పెట్రోల్‌ పోసి దహనం చేసినట్లుగా గుర్తించారు.

వెంటనే 80 శాతం దహనమైన స్థితిలో ఉన్న నారాయణ రెడ్డి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి హత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నారాయణరెడ్డి ఏడాది కిందట తన స్వగ్రామానికే చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే యువతి కుటుంబీకులు వారి వివాహాన్ని అంగీకరించకపోగా యువతిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆమె తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. అయినా ఇద్దరూ మాట్లాడుకుంటున్నారనే అనుమానంతో యువతి కుటుంబీకులు నారాయణ రెడ్డిని అంతమొందించేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో నారాయణ రెడ్డిని అతని గది నుంచి బయటకు రప్పించిన పొదల కొండపల్లికే చెందిన యువతి బంధువు శ్రీనివాస్‌ రెడ్డి.. ఆషిక్‌ కారులో రాయదుర్గం తీసుకెళ్లాడు. అక్కడ అతనికి మద్యం తాగించి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం శవాన్ని మాయం చేసేందుకు జిన్నారం ప్రాంతంలో పెట్రోల్‌ పోసి తగలబెట్టారు.