Hyderabad Metro: సమ్మెలో పాల్గొన్న మెట్రో ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవు, ఉద్యోగుల మెరుపు సమ్మెపై స్పందించిన హైదరాబాద్‌ మెట్రో యాజమాన్యం

ఈ మేరకు ధర్నాలో పాల్గొన్న వాళ్లపై చర్యలు తప్పవని మంగళవారం హెచ్చరించింది.

metro Representative Image

Hyd, Jan 3: జీతాల పెంపు పేరుతో హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) కాంట్రాక్ట్‌ ఉద్యోగులు చేపట్టిన మెరుపు సమ్మెపై హైదరాబాద్‌ మెట్రో యాజమాన్యం (Metro Officials) స్పందించింది. ఈ మేరకు ధర్నాలో పాల్గొన్న వాళ్లపై చర్యలు తప్పవని మంగళవారం హెచ్చరించింది. ఐదేళ్లుగా తమ జీతాల్లో పెరుగుదల లేదని ఆరోపిస్తూ.. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ వద్ద కాంట్రాక్ట్‌ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.

అయితే.. ఉద్యోగుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని మెట్రో యాజమాన్యం ప్రకటించింది. సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తామని తెలిపింది. అలాగే.. ధర్నాలో పాల్గొన్న ఉద్యోగులపై చర్యలు కచ్చితంగా ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం రూ. 11 వేలుగా ఉన్న జీతాన్ని.. కనీస వేతనం కింద రూ. 18 వేలకు పెంచాలంటూ టికెటింగ్‌ ఉద్యోగులు విధుల్ని బహిష్కరించి నిరసన చేపట్టారు.రెడ్‌ లైన్‌(మియాపూర్‌-ఎల్బీనగర్‌) మధ్య టికెట్‌ కౌంటర్ల వద్ద సిబ్బంది కొరతతో క్యూ లో టికెట్ల కోసం ప్రయాణికులు అవస్తలు పడుతున్నారు.

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలు, సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరిన మెట్రో రైలు ఎండీ

ఈ రోజు ఉదయం అమీర్‌పేట వద్ద సిబ్బంధి మెరుపు ధర్నాకు దిగారు. దీంతో మియాపూర్‌-ఎల్బీనగర్‌ రూట్‌లో గందరగోళం నెలకొంది. టికెట్ల కోసం ప్రయాణికులు భారీగా క్యూ కట్టారు. గత ఐదేళ్లుగా జీతాలు పెంచలేదని వాపోతున్నారు. కరోనా టైం తప్పిస్తే.. మిగతా రోజుల్లో విరామం లేకుండా పని చేస్తున్నప్పటికీ తమకు సరైన న్యాయం జరగట్లేదని అంటున్నారు. కేవలం పదకొండు వేల జీతంతో నెట్టుకొస్తున్నామని, చాలీచాలని జీతాలతో బతుకు కష్టంగా మారిందని ఉద్యోగులు అందోళన వ్యక్తం చేశారు.