Rakesh Funeral: అశ్రునయనాల మధ్య ముగిసిన రాకేష్ అంత్యక్రియలు, పాడె మోసిన మంత్రులు, వేలాదిగా తరలివచ్చిన గ్రామస్తులు, టీఆర్‌ఎస్ జెండాలతో సాగిన అంతిమయాత్ర, పలుచోట్ల ఉద్రిక్తతలు
వేలాది మంది ప్రజల అశ్రునయనాల మధ్య వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబ్బీర్‌పేటలో రాకేష్ అంత్యక్రియలు నిర్వహించారు. రాకేశ్ పాడెను మంత్రులు సత్యవతి రాథోడ్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మోసి శ్రద్ధాంజలి ఘటించారు.
Warangal, June 18: సికింద్రాబాద్ అల్లర్లలో మృతి చెందిన దామెర రాకేష్(Damera Rakesh) అంత్యక్రియలు (Funeral) ముగిశాయి. వేలాది మంది ప్రజల అశ్రునయనాల మధ్య వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబ్బీర్‌పేటలో (Dabbirpet) రాకేష్ అంత్యక్రియలు నిర్వహించారు. రాకేశ్ పాడెను మంత్రులు సత్యవతి రాథోడ్ (Sathyavathi Rathod), ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar rao), ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మోసి శ్రద్ధాంజలి ఘటించారు. రాకేశ్ అంతిమయాత్రలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ విధానాలు, ఆర్పీఎఫ్ పోలీసుల కాల్పులను నిరసిస్తూ రాకేశ్ అంతిమయాత్రలో నల్లజెండాలతో భారీ ప్రదర్శన చేపట్టారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా యువకులు నినాదాలు చేశారు.
వరంగల్ ఎంజీఎం (MGM) నుంచి ధర్మారం, నర్సంపేట (Narsampet)అయ్యప్ప స్వామి ఆలయం, పాకాల సెంటర్ మీదుగా ఖానాపూర్ మండలం దబీర్‌పేట వరకు రాకేశ్ అంతిమయాత్ర కొనసాగింది. అంతకుముందు వరంగల్ ఎంజీఎం నుంచి స్వగ్రామానికి శనివారం ఉదయం రాకేశ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అంతిమ యాత్ర కొనసాగుతుండగా ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. అంతిమ యాత్రలో పాల్గొన్న ఆందోళనకారులు.. ఒక్కసారిగి వరంగల్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్(BSNL) ఆఫీసుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆఫీసుకు నిప్పు పెట్టే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు.