Hyderabad, June 18; సికింద్రాబాద్ (Secundrabad)రైల్వే స్టేషన్‌లో అగ్నిపథ్‌కు (Agneepath)వ్యతిరేకంగా జరిగిన ధర్నా హింసాత్మకం కావడంపై సీఎం కేసీఆర్ (Cm KCR) ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ (Rakesh) మరణించడం బాధాకరమని అన్నారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాకేశ్ కుటుంబానికి సీఎం కేసీఆర్ 25 లక్షల ఎక్స్‌గ్రేషియా (Ex-gratia)ప్రకటించారు. అలాగే కుటుంబంలో అర్హులైన వారికి వారి అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం (Govt. Job) ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు బీసీ బిడ్డ రాకేశ్ బలయ్యాడని వాపోయారు. తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లనే రాకేష్ బలయ్యిండని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. #AgnipathScheme
— Telangana CMO (@TelanganaCMO) June 17, 2022
ఆర్మీలో పనిచేస్తున్న అక్కనుంచి ప్రేరణపొందాడు రాకేష్ (Rakesh). ఆమె లాగానే ఆర్మీలో చేరి దేశసేవ చేయాలని పరితపించాడు. ఇందుకోసం నిత్యం శ్రమించాడు. రెండుసార్లు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు హాజరై, చిన్నకారణంతో రిజెక్ట్ అయ్యాడు. అయినా పట్టువదలకుండా మళ్లీ ప్రయత్నించి ఫిజికల్ టెస్టులన్నీ పాసయ్యాడు. ఎంపిక ప్రక్రియకోసం చూస్తున్న అతడు అగ్నిపథ్ రూపంలో తన ఆశలు ఆవిరైపోతాయని తెలుసుకుని నిరసనకు దిగాడు. ఆర్పీఎఫ్ కాల్పుల్లో గాయపడి తన కల నెరవేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ఈ హృదయ విదారక ఘటన వరంగల్ జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. వరంగల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం మారుమూల డబీర్‌పేట గ్రామానికి చెందిన దామెర కుమార స్వామి, పూలమ్మ దంపతుల కొడుకు రాకేశ్ (21) హన్మకొండలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో పనిచేస్తున్న తన అక్క సంగీత నుంచి ప్రేరణ పొంది ఆర్మీలో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
దామెర రాకేశ్..రెండుసార్లు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలకు హాజరయ్యాడు. చిన్న కారణం వల్ల ఉద్యోగం కోల్పోయాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ ప్రయత్నించాడు. ఇటీవలే ఫిజికల్ టెస్ట్‌లలో ఉత్తీర్ణత సాధించాడు. ఎంపిక ప్రక్రియ కోసం వేచి చూస్తున్నాడు. అయితే అగ్నిపథ్ స్కీం ద్వారానే రిక్రూట్‌మెంట్ జరుగుతుందని తెలియగానే తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. హన్మకొండకు చెందిన మరో 14 మందితో కలిసి నిరసన తెలిపేందుకు హైదరాబాద్‌కు చేరుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్పీఎఫ్ (RPF) పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పాయాడు.
తమ కొడుకు రాకేశ్ గత కొన్నేళ్లుగా హన్మకొండలో ఆర్మీ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. అగ్నిపథ్ (Agneepath) వల్ల తన భవిష్యత్ పాడైపోతుందని మనస్తాపం చెందాడని ఆవేదన వ్యక్తంచేశారు. నిరసన తెలిపేందుకు హైదరాబాద్ వచ్చాడని చెప్పారు. తమ పెద్దకొడుకు దివ్యాంగుడని తెలిపారు. కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న చిన్న కొడుకు కాల్పుల్లో మరణించడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం ఓ యువకుడి ప్రాణాలను బలిగొందని గ్రామస్తులు విమర్శించారు. రాకేశ్ కుటుంబానికి కేంద్ర సర్కారు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు రాకేశ్ బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు.