Hyd, June 17: ఆర్మీ ఉద్యోగార్థులు చేపట్టిన ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అట్టుడికిన (Agnipath Protests) సంగతి విదితమే.. ఈ విధ్వంసంలో రూ. 7 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ గుప్తా (Secunderabad DRM AK Gupta) స్పష్టం చేశారు. ఐదు రైలింజన్లకు నిప్పు పెట్టడంతో పాటు 30 బోగీలను ఆందోళనకారులు ధ్వంసం చేశారని ఆయన పేర్కొన్నారు. స్టేషన్‌లోని పార్సిల్ ఆఫీసును పూర్తిగా ధ్వంసం చేశారని తెలిపారు.
ఆందోళనకారుల నిరసనల నేపథ్యంలో 18 ఎక్స్‌ప్రెస్, 9 ప్యాసింజర్ రైళ్లు, 65 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశామన్నారు. ఇవికాక 15 రైళ్లను పాక్షికంగా రద్దు చేయడం జరిగిందని తెలిపారు. 8 రైళ్లను డైవర్ట్ చేశాం. ఒక రైలును రీషెడ్యూల్ చేశామని చెప్పారు. రైల్వే ప్రయాణికుల కోసం అధికారులు హెల్ప్ లైన్ నంబర్‌ను కేటాయించారు. రైళ్ల రద్దు, మళ్లింపు వివరాలకు సంబంధించి హెల్ప్‌లైన్ నంబర్ 040-2778666 కు కాల్ చేయాలని సూచించారు.
ఇక పోలీసుల బలగాల ఎంట్రీతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పరిస్థితి ఒక్కసారిగి మారిపోయింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే ట్రాక్‌లను క్లియర్ చేశారు. దీంతో రైళ్ల రాకపోకలకు రూట్ క్లియర్ అయింది. డీఆర్‌ఎమ్ గుప్తా (Secunderabad DRM AK Gupta) మీడియాతో మాట్లాడుతూ.. మరో గంటలో రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఆందోళనకారులు రైల్వే స్టేషన్‌లో సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. గతంలో ఇలాంటి ఆందోళనలు ఎప్పుడూ జరగలేదు. ఆందోళనల్లో 30 భోగీలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 18 ఎక్స్‌ప్రెస్, 9 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశాము. 15 రైళ్లను దూరప్రాంతాల నుంచి నడుపుతున్నాము. విజయవాడ, కాజీపేట నుంచి వచ్చే రైళ్లను మౌలాలీ నుంచి దారి మళ్లించినట్టు స్పష్టం చేశారు. ఈస్‌కోస్ట్, శబరి, ఫలక్‌నామా, ధనాపూర్, షిర్డీ, ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్టు తెలిపారు.
7 లోకోమోటివ్ ఇంజిన్లు ధ్వంసమయ్యాయి. రైల్వే సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. రెండు లగేజీ, రెండు సాధారణ భోగీలకు ఆందోళనకారులు నిప్పంటించారు. పలు భోగిలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపించాము’’ అని స్పష్టం చేశారు. మరోవైపు.. కాసేపట్లో నుంచి మెట్రో రైళ్లు కూడా ప్రారంభం కానున‍్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి అయింది. అనంతరం రాకేశ్ డెడ్‌బాడీని స్వస్థలమైన వరంగల్‌కు తరలించారు.
ఇక రైల్వే అధికారులు.. నిరసనకారులను చర్చలకు ఆహ్వానించడంతో ఆందోళనకారులు ఒప్పుకున్నారు. అయితే, అధికారులే రైల్వే స్టేషన్‌కు రావాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. దీంతో, వారి డిమాండ్ అధికారులు తిరస్కరించారు. ప్రస్తుతం రైల్వే ట్రాక్‌పై 200 మంది ఆందోళనకారులు నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిరసనకారులు మాట్లాడుతూ.. ‘‘ఆందోళనలు చేసి వెళ్లిపోదాం అనుకున్నాము. మాపై కాల్పులు ఎందుకు జరిపారు. 10 మంది కాదు అందరం చర్చకు వస్తాము. చావడానికైనా సిద్దం.. ఇక్కడి నుంచి కదిలేది లేదు. కేంద్రం హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని’’ తేల్చి చెప్పారు.
తమపై కాల్పులు జరపాలని ఎవరు ఆర్డర్ ఇచ్చారని ఆందోళనకారులు ప్రశ్నించారు. తాము ఏమైనా ఉగ్రవాదులమా.. కాల్పులు జరపడానికి అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆందోళన చేస్తే కాల్పులు జరుపుతారా అని మండిపడ్డారు. తమ నిరసనల్లో ఎలాంటి రాజకీయాలు లేవని, తమ న్యాయం కోసం పోరాటం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు.
నాలుగు సంవత్సరాలుగా దీన్నే నమ్ముకొని ఉన్నాం. ఆందోళనల్లో రెండు బోగీలు తగలబడ్డాయంటున్నారు.. మూడు ఏళ్లుగా మా జీవితాలు నాశనం అవుతున్నాయి. అవి ఎవరూ పట్టించుకోవడం లేదు. కేవలం నాలుగేళ్ల కోసం సర్వీస్‌లో చేరలేం. అందరికీ పరీక్షను నిర్వహిస్తామని తెలిపే వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. వయోపరిమితిని కూడా పెంచాలి. దాదాపు 2 వేల మందికి పైగా వచ్చాం. 8.30 గంటలకు వచ్చాం. మేం ఫిజికల్, మెడికల్‌పాస్ అయినం. పెండింగ్‌లో ఉన్న కామన్ ఎగ్జామ్‌ను నిర్వహించాలి అంటూ ఆర్మీ అభ్యర్థులు పేర్కొన్నారు.