One killed as violence rocks Secunderabad railway station (Photo-Twitter)

Hyd, June 17: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ను యథాతథంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగిన యువత విధ్వంసానికి పాల్పడ్డారు. రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లి పట్టాలపై పార్సిల్‌ సామాన్లు వేసి నిరసన తెలిపారు. ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న దుకాణాల్లో వస్తువులు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

ఆందోళనకారులు పోలీసులపై రాళ్లదాడికి దిగారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. ఓ యువకుడు మృతిచెందాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రికికు తరలించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. స్టేషన్ల వద్ద భారీగా బలగాలను మోహరించారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో భారీగా బలగాలను మోహరించారు. స్టేషన్‌లోకి ఎవరినీ అనుమంతించడం లేదు. అదేవిధంగా వరంగల్‌, నిజామాబాద్‌, డోర్నకల్‌, మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్లలో బందోబస్తు పెంచారు. వరంగల్‌, ఖాజీపేట రైల్వే స్టేషన్లలో భాద్రతా ఏర్పాట్లను సీపీ తరుణ్‌ జోషి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

అసలేం జరిగింది..సికింద్రాబాద్‌లో అగ్గి రాజేసిందెవరు, అదుపు తప్పిన యువకులతో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, క్షణాల్లో రైల్వే స్టేషన్ అంతటా దట్టమైన మంటలు

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో నిర్వహించిన ఆందోళనలతో దాదాపు రూ.20 కోట్ల మేర నష్టం జరిగిందని సౌత్‌సెంట్రల్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ తెలిపారు. అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ యువత పెద్దఎత్తున ఆందోళన చేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అన్ని రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించింది.