Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు, విదేశాల్లో దాక్కున్న ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీసులు, నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు
ఈ కేసులో ఐటీ యాక్ట్ 66(ఎఫ్)ను పోలీసులు ప్రయోగించనున్నారు. దీనిపై పోలీసులు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేయనున్నారు.
Hyd, April 25: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.నిందితులపై దర్యాప్తు బృందం సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. ఈ కేసులో ఐటీ యాక్ట్ 66(ఎఫ్)ను పోలీసులు ప్రయోగించనున్నారు. దీనిపై పోలీసులు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేయనున్నారు. ఈ కేసులో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న బెయిలు పిటిషన్‌పై వాదనలు బుధవారం పూర్తయ్యాయి. ఇరువర్గాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది.
ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రిమాండులో ఉన్న ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు.. తమకు బెయిలు మంజూరు చేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టగా.. పోలీసుల తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో నిందితులకు బెయిలు మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు, కీలక వికెట్‌ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు, జైల్లో చిప్పకూడు తప్పదన్న సీఎం రేవంత్ రెడ్డి
ఇక స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(SIB) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే ఆయన విదేశాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాకర్ రావు ఆచూకీ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే ఆ నోటీసులకు ప్రభాకర్ నుంచి స్పందన లేకపోవడంతో ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఫ్యామిలీ ట్రిప్ పేరుతో రాష్ట్రం దాటారు. ఆపై ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. అయితే ఆయన ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఆరు నెలల విజిటింగ్ వీసా మీద ఆయన అక్కడికి వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. ఇప్పటికే రెండు నెలలు ముగియడంతో.. మరో నాలుగు నెలల తర్వాతే ఆయన ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు, చంచలగూడ జైలుకు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, 14 రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
ఇక ఈ కేసులో సాక్ష్యాలను బట్టి పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అంతేకాదు.. ఐటీ చట్టాల ప్రకారం నిందితులపై కేసులకు అనుమతించాలని ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటిషన్ సైతం వేశారు. మరోవైపు ఇదే న్యాయస్థానంలో నలుగురు నిందితుల (ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావు) బెయిల్ పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలవడనుంది. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని సీపీ, ఇప్పటికే నిందితుల నుంచి సమాచారం పూర్తిగా దర్యాప్తు అధికారులు సేకరించారని నిందితుల తరఫు న్యాయవాది వాదనలు ఇప్పటికే వినిపించారు.