Murder Attempt On Armoor MLA: సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేశాడనే కక్ష, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం, నిందితుడిని అరెస్ట చేసిన పోలీసులు
ఈ షాకింగ్ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి (Armoor MLA Jeevan Reddy) నివాసం దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.
Hyd, August 2: తెలంగాణ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఈ షాకింగ్ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి (Armoor MLA Jeevan Reddy) నివాసం దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. హత్యాయత్నానికి ప్రయత్నించిన నిందితుడిని ఆర్మూర్‌కు చెందిన మక్లూర్ మండలం కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్తగా గుర్తించారు. తన భార్య లావణ్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె భర్త ప్రసాద్ గౌడ్ (attempt to murder Armoor MLA Jeevan Reddy) ఎమ్మెల్యేపై కక్ష పెంచుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
కాగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటి దగ్గర ప్రసాద్ గౌడ్ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రెండు తుపాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటివద్ద సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.
ఇందులో జీవన్‌రెడ్డి ఇంట్లోకి సర్వంచ్ భర్త ప్రసాద్‌గౌడ్ చొరబడినట్లు కనిపిస్తోంది. ధర్డ్ ఫ్లోర్‌లోకి వెళ్లిన నిందితుడు ఎమ్మెల్యే బెడ్‌రూం డోర్ తీశాడు. ఆ సమయంలో జీవన్‌రెడ్డి మేల్కొని ఉండి కేకలు వేయడంతో అలెర్టయిన నిందితుడు అక్కడి నుంచి బయటకు పరిగెత్తాడు. అయితే ఇంట్లో నుంచి పరుగెత్తుతున్న ప్రసాద్ గౌడ్‌ను జీవన్‌రెడ్డి సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు.