KTR Slams CM Revanth Reddy: కేసీఆర్ పార్టీని ఖతం చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటయ్యారు, సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, వీడియోలు ఇవిగో..
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంలా మారిందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పార్టీని ఖతం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కైయ్యాయని కేటీఆర్ (KTR Slams CM Revanth Reddy) ఆరోపించారు.
Hyd, Feb 25: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంలా మారిందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పార్టీని ఖతం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కైయ్యాయని కేటీఆర్ (KTR Slams CM Revanth Reddy) ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన మాజీ జడ్పిటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లల వివాహాలకు రూ. లక్షతో పాటు తులం బంగారం, రూ. 15 వేలు రైతు భరోసా, రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 450 రోజులు అవుతుంది. రోజుకు ఒకరి చొప్పున 450 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి లేదు. భారతదేశంలో రైతు ఆత్మహత్యలు అత్యధికంగా తగ్గించింది కేసీఆర్ ప్రభుత్వం అని కేంద్రం పార్లమెంట్‌లో చెప్పింది. కానీ ఈ ప్రభుత్వంలో మళ్లీ ఆత్మహత్యలు మొదలయ్యాయని మండిపడ్డారు.
మరి కాలం తెచ్చిన కరువా..? కాంగ్రెస్ తెచ్చిన కరువా..? అర్థం చేసుకోవాలి. కేసీఆర్ మీద కోపంతోనే మేడిగడ్డ రిపేర్ చేయడం లేదు. శివుడు గంగను కిందకు తీసుకువస్తే.. కేసీఆర్ గంగను పైకి తెచ్చిండు. కానీ రైతులకు మాయమాటలు చెప్పి ఓట్లు కొల్లగొట్టారు అని కేటీఆర్ తెలిపారు.కాళేశ్వరంలో ఒక బ్యారేజ్‌లో ఒక పర్రె వడితే.. దానికి కాంగ్రెస్ నేతలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా లొల్లి పెట్టిండ్రు. మరి ఇవాళ సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కూలిపోతే మాట్లాడరు.
KTR Slams CM Revanth Reddy
ఖమ్మం వద్ద పెద్దవాగు కొట్టుకుపోతే ఎవరు మాట్లాడరు. రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలా బీజేపీ ఉంది. కాళేశ్వరంలో ఒక పిల్లర్‌కు పర్రె వడితే.. ఎన్డీఎస్ఏ వాలిపోయింది. మరి ఇవాళ ఎస్ఎల్‌బీసీలో టన్నెల్ కూలి దాదాపు 72 గంటలు అవుతుంది మరి ఎందుకు ఎన్డీఎస్ఏ రాలేదు. ఏ బీజేపోడు మాట్లాడడు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడం లేదు. ఏం ఇబ్బంది వచ్చింది. సుంకిశాల కూలిపోతే గవినోళ్ల శ్రీనివాస్ ఆర్టీఐ కింద రఖాస్తు పెట్టుకుంటే.. ఇది దేశ భధ్రతకు సంబంధించిన అంశం.. సమాధానం ఇవ్వమని చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు.
ఎన్నికల ప్రచారంలో మోదీ వచ్చి.. కాంగ్రెస్ పార్టీ (Congress) అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతుంది.. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని విమర్శలు చేశారు. కానీ ఇంత వరకు చర్య లేదు. రేవంత్ రెడ్డి బామ్మర్ది కంపెనీ శోధా 2 కోట్ల లాభం ఆర్జించింది. అమృత్ స్కీంలో రూ. 1137 కోట్ల కాంటాక్ట్ ఇచ్చారు బామ్మర్ది కంపెనీకి రేవంత్ రెడ్డి. దీని మీద విచారణ చేయాలని సంబంధిత కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశాం. ఆరు నెలలు అవుతంది.. ఇప్పటి వరకు స్పందన లేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ రైడ్ అయింది.. ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పటి వరకు ఎవరూ నోరు విప్పడం లేదని మండిపడ్డారు.ఈ రాష్ట్రంలో కేసీఆర్ పార్టీ ఉంటే.. కాంగ్రెస్, బీజేపీ ఆటలు సాగవని తెలుసు కాబట్టి.. ఆ ఇద్దరు కలిసి కేసీఆర్ పార్టీని ఖతం చేయాలన్నదే ఆలోచన. అసెంబ్లీ ఎన్నికల్లో కుమ్మక్కై సక్సెస్ అయ్యారని కేటీఆర్ తెలిపారు.
రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ఇప్పటికీ 35 సార్లు ఢిల్లీ వెళ్లి చేసిందేమిటీ..? తాజాగా ఇవాళ 36వ సారి ఢిల్లీకి వెళ్లిండు.. ఇప్పుడు పీకేదేంటి..? అని కేటీఆర్ ప్రశ్నించారు.15 నెలల కాలంలోనే అధికార పార్టీని వదిలిపెట్టి బీఆర్ఎస్‌లో చేరుతున్నారంటే.. ఆ పార్టీ పాలన ఏంటో అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలకు విసుగు వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లోనూ పట్నం నరేందర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్‌లో చేరారు. 15 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు కోపం వస్తుందని కేటీఆర్ తెలిపారు.
గత 48 గంటల్లో రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకో దిక్కు ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు సొరంగంలో ఇరుక్కుపోయారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఆ ఎన్నికతో గవర్నమెంట్ మారేది లేదు.. ప్రభుత్వం తలకిందులు అయ్యేది లేదు. కానీ దాని కోసం హెలికాప్టర్‌లో పోయి మాట్లాడుతున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఇక మేధావిలా డైలాగులు కొట్టుడు కాదు.. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధం కావాలని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనే రేవంత్ రెడ్డికే దిక్కు లేదు.. మీ కడియం శ్రీహరి ఉంటాడా అని అడుగుతున్నాను. తెల్లారిలేస్తే నీతులు మాట్లాడుతడు.. ప్రపంచంలో నా కంటే మేధావి ఎవరు లేరన్నట్టు ప్రవర్తిస్తుండు.. ఆ లెవల్‌లో ఫోజులు కొడుతుండు కడియం శ్రీహరి.
మరి నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్దమనిషి.. ఏమన్న ఇజ్జత్ ఉంటే రాజీనామా చేసి ఉప ఎన్నికకు రా. దమ్ముంటే రా.. భీకరమైన డైలాగులు ఎందుకు.. నిజంగా నీవు చేరిన కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉందనుకుంటే రాజీనామా పెట్టు.. ఉప ఎన్నికకు రా. సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నాం.. న్యాయం జరుగుతది.. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. బరాబర్ కొట్లాడాలి.. వీళ్ల సంగతేంటో తేల్చాలి అని కేటీఆర్ అన్నారు.
మోసపోయామని ప్రజలకు కూడా అర్థమైంది.. ప్రజలకు కూడా తెలియాలి.. గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తది. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తది.. రేవంత్ రెడ్డిని చూసిన తర్వాతనే కేసీఆర్ విలువ తెలుస్తుంది. ప్రజలకు కూడా తెలిసిరావాలి. రుణమాఫీ లేదు, రైతుబంధు, కల్యాణలక్ష్మి లేదు. తెలంగాణ రైతులకు టకీటకీమని డబ్బులు పడడం లేదు కానీ.. టకీటకీమని ఢిల్లీలో మాత్రం మోగుతుంది.. ఎందుకంటే పదవిని కాపాడుకోవాలి కాబట్టి. బిల్డర్లు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వద్ద దోచుకుని ఢిల్లీలో అప్పజెప్పుతుండు అని కేటీఆర్ ఆరోపించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)