Telangana Rains: బీ అలర్ట్, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, తెలంగాణలో మరో మూడు రోజులు వడగండ్లతో కూడిన భారీ వర్షాలు
పశ్చిమ విదర్భ నుంచి మరాఠ్వాడా, ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి అనిశ్చితి కొనసాగుతున్నదని హైదరాబాద్ కేంద్రం తెలిపింది
Hyd, May 2: తెలంగాణలో ఎండకాలంలోనే అకాల వర్షాలు భారీగా కురుస్తున్నాయి. పశ్చిమ విదర్భ నుంచి మరాఠ్వాడా, ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి అనిశ్చితి కొనసాగుతున్నదని హైదరాబాద్ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నది.
మంగళవారం దేశవ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక రాష్ర్టాల్లో ఉరుములు, వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది వెల్లడించింది. ఈ వారాంతంలో మళ్లీ ఎండలు పుంజుకుంటాయని వాతావరణ కేంద్రం పేర్కొన్నది. వచ్చే వారం నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించింది.