Prabhakar Reddy Attack Case: కొత్త ప్రభాకర్‌రెడ్డి హత్యాయత్నం కేసు, నిందితుడికి 14 రోజులు రిమాండ్, మీడియాకు వివరాలను అందించిన సీపీ శ్వేత

ఈ కేసుపై సీపీ శ్వేత ( CP Swetha ) సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మీడియాకు వివరాలను అందజేశారు

CP Swetha (Photo-Video Grab)

Hyd, Nov 1: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి ( MP Prabhakar Reddy )పై ఈ నెల 30వ తేదీ రోజున సూరంపల్లిలో కత్తితో నిందితుడు రాజు దాడి చేసిన సంగతి విదితమే. ఈ కేసుపై సీపీ శ్వేత ( CP Swetha ) సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మీడియాకు వివరాలను అందజేశారు.ఈ సందర్భంగా సీపీ మీడియాతో మాట్లాడుతూ...సంచలనం కోసమే నిందితుడు రాజు .. ఎంపీపై దాడి చేశారని తెలిపారు. ‘‘నిందితుడికి ఎవరి సహకారం లేదు. రాజు ఒక్కడే హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

వారం క్రితం కత్తికొనుగోలు చేసి ఎంపీ హత్యకు పథకం రచించాడు. పలు సోషల్‌ మీడియా ఛానళ్లలో పనిచేస్తున్నాడు. నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. సోషల్ మీడియాలో ఎవరూ రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు’’ అని సీపీ సూచించారు.ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతానికి నిందితుడు రాజు ఎవరి సహకారం తీసుకోలేదు, అతనొక్కడే ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేశారు. నిందితుడు సెన్సేషనల్ క్రియేట్ చేయడానికే దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది’’ అని సీపీ శ్వేత తెలిపారు.

నాలుగు రోజుల పాటు ఐసీయూలోనే కొత్త ప్రభాకర్ రెడ్డి, దర్యాప్తును వేగవంతం చేసిన సిద్ధిపేట పోలీసులు

ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దుండగుడు కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలవరం రేపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం ప్రభాకర్‌రెడ్డి సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలంలోని గాజులపల్లి, దొమ్మాట, ముత్యంపేటలో ప్రచారం ముగించుకొని సూరంపల్లికి వెళ్లారు. అక్కడ పాస్టర్‌ అంజయ్యను పరామర్శించారు. తిరిగి బయలుదేరేందుకు కారు వద్దకు రాగా.. ఆయనతో కొందరు స్థానికులు సెల్ఫీలు దిగారు. అదే సమయంలో మిరుదొడ్డి మండలం పెద్దచెప్యాలకు చెందిన గట్టని రాజు(38) ఎంపీతో కరచాలనం చేసేందుకు వచ్చినట్లు వెనుక నుంచి చేయి చాపుతూ ఆకస్మాత్తుగా తన జేబులో నుంచి కత్తి తీసి.. ఎంపీ కుడివైపు పొట్టలో పొడిచాడు.

యశోద ఆస్పత్రిలో ముగిసిన కొత్త ప్రభాకర్ రెడ్డి సర్జరీ, చిన్న ప్రేగును తొలగించిన వైద్యులు, మెదక్ ఎంపీని పరామర్శించిన సీఎం కేసీఆర్

ఎంపీ వెంట ఉన్న గన్‌మెన్‌ ప్రభాకర్‌ వెంటనే తేరుకొని రాజును పట్టుకుని కత్తిని లాగేసుకోగా.. చుట్టూ ఉన్న BRS నాయకులు, కార్యకర్తలు అతన్ని కొట్టారు. ఎంపీని కార్యకర్తలు కారులో గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు కుట్లు వేశారు. వారి సూచనల మేరకు ప్రభాకర్‌రెడ్డిని సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి పొట్టలో కత్తితో పొడవడంతో చిన్న పేగుకు తీవ్ర గాయమైందని, పొట్టలోనే తీవ్ర రక్తస్రావమైందని యశోద వైద్యులు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాకర్‌రెడ్డి యశోద ఆసుపత్రికిలో చికిత్స పొందుతున్నారు.