Bandi Sanjay Arrest: అధికారం, అహంకారంతో కేసీఆర్ కళ్లు నెత్తికెక్కాయి, తీవ్ర విమర్శలు చేసిన బండి సంజయ్, బీజేపీ జాగరణదీక్ష భగ్నం, కరీంనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు

ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణదీక్షను (Jagarana Deeksha) పోలీసులు భగ్నం చేశారు.అక్కడ లాఠీఛార్జీలు, తోపులాటలతో ఎంపీ ఆఫీసు యుద్ధక్షేత్రాన్ని తలపించింది.

CM KCR vs Bandi Sanjay (Photo-File Image)

Hyd, Jan 3: ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణదీక్షను (Jagarana Deeksha) పోలీసులు భగ్నం చేశారు.అక్కడ లాఠీఛార్జీలు, తోపులాటలతో ఎంపీ ఆఫీసు యుద్ధక్షేత్రాన్ని తలపించింది. కార్యాలయం లోపలి నుంచి తాళం వేసుకుని సంజయ్‌ దీక్షకు దిగగా.. రాత్రి 10 గంటల సమయంలో తలుపులు బద్ధలు కొట్టి లోనికి ప్రవేశించిన పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్టు (Bandi Sanjay Arrest) చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో సంజయ్‌ (BJP MP Bandi Sanjay Kumar) అక్కడే దీక్షకు దిగారు.

గత రాత్రి ఏడున్నర గంటల నుంచే దీక్ష కోసం ఏర్పాట్లు చేయగా, మధ్యాహ్నం నుంచే బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో దీక్షా స్థలికి చేరుకున్నారు. అయితే ఈ దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయం, బొడిగె శోభ తదితరులు ఉన్నారు. నేతల అరెస్టులతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

క్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి బండి సంజయ్ బైక్‌పై కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయన వారి నుంచి తప్పించుకుని లోపలికి వెళ్లి దీక్ష చేపట్టారు. రాత్రి 8 గంటల సమయంలో దీక్ష ప్రారంభం కాగా, కార్యాలయ ప్రధాన ద్వారాన్ని పార్టీ నేతలు మూసివేశారు. కాగా ఒమిక్రాన్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో సభకు అనుమతి లేదని, నిర్వహించవద్దని పోలీసులు ఉదయమే నోటీసులు జారీచేశారు. అయినా పెద్దయెత్తున కార్యకర్తలు దీక్షా స్థలానికి చేరుకోవడంతో పోలీసులు వచ్చినవారిని వచ్చినట్లుగా అరెస్టు చేశారు. సాయంత్రానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు సైతం గుమిగూడటంతో పోలీసులు పలుమార్లు లాఠీలకు పనిచెప్పారు. కార్యకర్తలను చెదరగొట్టేందుకు స్వయంగా సీపీ సత్యనారాయణ కూడా లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది.

Here's Bandi Sanjay Kumar Tweet

తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య బండి సంజయ్‌ సినీఫక్కీలో బైకు మీద తన కార్యాలయానికి వచ్చారు. పోలీసుల కళ్లు గప్పి లోపలికి వెళ్లి ప్రహరీ గేటుకు, కార్యాలయానికి లోపలి నుంచే తాళం వేసుకున్నారు. కిటికీలో నుంచి మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తనను, టీచర్లను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన కేసీఆర్‌కు గుణపాఠం చెబుతామన్నారు. అనంతరం వందమందికి పైగా నేతలతో కలిసి లోపలే కూర్చుని దీక్షకు దిగారు. సంజయ్‌ దీక్షను భగ్నం చేసేందుకు రాత్రి 10.గంటల సమయంలో తలుపులు పగలగొట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇంకొందరు పోలీసులు కిటికీల్లోంచి స్ప్రింక్లర్ల ద్వారా లోపలికి నీటిని చిమ్మడంతో కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు. తొలుత గ్యాస్‌ కట్టర్లతో గేట్లు తొలగించి, అనంతరం గునపాలతో తలుపులు తెరిచారు. తలుపులు తెరుచుకోకుండా కార్యకర్తలు లోపలి నుంచి తీవ్రంగా ప్రతిఘటించారు.

రేవంత్‌రెడ్డికి కరోనా, జ్వరంతో కూడిన స్వల్ప లక్షణాలు, తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని కోరిన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్

ఎట్టకేలకు తలుపులు తెరిచిన పోలీసులు సంజయ్‌ని బలవంతంగా ఎత్తుకొచ్చి, అరెస్టు చేసి జీపులో వేసి తీసుకెళ్లారు. అరెస్టు సమయంలో బండి సంజయ్‌ కూడా తీవ్రంగా ప్రతిఘటించారు. బండి సంజయ్‌ అరెస్టు అనంతరం మరోసారి భారీగా కార్యకర్తలు ఎంపీ కార్యాలయం వద్దకు దూసుకురావడంతో నాలుగోసారి పోలీసులు లాఠీఛార్జి చేశారు.

తన దీక్షను భగ్నం చేయడంపై బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం, అహంకారంతో కేసీఆర్ కళ్లు నెత్తికెక్కినట్టు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపైనా మండిపడిన ఆయన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో ఎంతోమంది గాయపడ్డారని, వారికేమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్‌, న్యూఇయర్‌ నాడు తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలెన్ని అంటే! ఏపీలోనూ రికార్డుస్థాయిలో లిక్కర్ సేల్

అంతేకాదు, ‘‘నువ్వు జైలుకెళ్లే సమయంలో నీ కుటుంబ సభ్యులు కూడా పోలీసుల తీరుతో ఇలాగే ఇబ్బంది పడతారు’’ అని కేసీఆర్‌ను ఉద్దేశించి హెచ్చరించారు. తన కార్యాలయంలోకి వచ్చి దౌర్జన్యం చేసిన పోలీసులకు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇస్తానని హెచ్చరించారు. ఇదిలావుంచితే, బండి సంజయ్ అరెస్ట్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందిస్తూ.. కేసీఆర్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. బండి సంజయ్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. తలుపులు బద్దలుగొట్టి మరీ ఆయనను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని అన్నారు. అలాగే, ఎంపీ అర్వింద్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు కూడా సంజయ్ అరెస్ట్‌ను ఖండించారు.