Weather Forecast: మరో మూడు రోజులు తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్, సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపిన వాతావరణ శాఖ
రెండు రోజులు అకాల వర్షాలు కురియడంతో తాత్కాలికంగా కాస్త చల్లబడిన వాతావరణం తిరిగి వేడెక్కుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Hyd, May 6: ఎండ తీవ్రత పెరిగింది. రెండు రోజులు అకాల వర్షాలు కురియడంతో తాత్కాలికంగా కాస్త చల్లబడిన వాతావరణం తిరిగి వేడెక్కుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని.. ఈ నెల 6, 7, 8 తేదీల్లో వివిధ ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు ( heat wave till May 8) నమోదవుతాయని చెప్పింది. గురువారం రాష్ట్రంలో అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 42.8 డిగ్రీలుగా.. అతితక్కువగా కనిష్ట ఉష్ణోగ్రత హైదరాబాద్‌లో 20.4 డిగ్రీలుగా నమోదైనట్టు వెల్లడించింది. విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఉందని.. దాని ప్రభావంతో రెండ్రోజుల్లో అక్కడక్కడా వర్షాలు పడతాయంది.
గురువారం హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలపైన పగటి ఉష్ణోగ్రతలు (Telangana to witness heat wave) నమోదయ్యాయి. ఉత్తరాది నుంచి వస్తున్న వేడిగాలుల వల్ల శుక్ర, శని, ఆదివారాలలో అదనంగా 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. గాలి వచ్చితి, ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతున్నదని తెలిపింది. దీని ప్రభావంతో ఎండలు తీవ్రంగా ఉంటాయని, అలాగే రాగల మూడు రోజుల్లో పలు చోట్ల గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది.
వాతావరణంలో మార్పుల కారణంగా ఈ ఏడాది ఒకేసారి ఎండలు, వానలు వస్తున్నాయి. హీట్ హైల్యాండ్ ఎఫెక్ట్‌తో పాటు ఉత్తరాది నుంచి వస్తున్న గాలులతో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయని, దీంతో వడగాలులు మార్చి, ఏప్రిల్ నెలల్లోనే వచ్చాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. విపరీతమైన ఎండల కారణంగా ఆ వెంటనే ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయని అంటున్నారు. కాలుష్యం, పట్టణీకరణ, పారిశ్రామికీకరణల ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా గత 50 ఏండ్లలో ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగిందని టీఎస్‌డీపీఎస్ కన్సల్టెంట్, సీనియర్ సైంటిస్ట్ వైవీ రామారావు చెప్పారు.
2002-03, 2003-04 సంవత్సరాలలో గోదావరి, కృష్ణా నదుల్లో చుక్కనీరు లేని పరిస్థితిని చూశామని, పుష్కరాల కోసం నదిలో బోర్లు వేసి నీటిని వినియోగించుకున్నామని మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ చైర్మన్ డాక్టర్ ప్రసన్నకుమార్ గుర్తుచేశారు. గత 12 ఏండ్లలో వర్షాల తీరును పరిశీలిస్తే చెన్నై, ముంబై, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో క్లౌడ్ బరస్ట్‌లు ఏర్పడ్డాయని అన్నారు. ఈసారి విచిత్రంగా ఉదయం చల్లగా ఉంటున్నదని, మధ్యాహ్నం అయ్యే వరకు విపరీతమైన ఎండలు ఉంటున్నాయని, సాయంత్రం అయ్యేసరికి ఒకేసారి మబ్బులు కమ్మి వర్షం వస్తున్న పరిస్థితి చూస్తున్నామని తెలిపారు.