Telangana: వైఎస్ షర్మిలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు, పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు, వైఎస్ విజయమ్మను అడ్డుకున్న పోలీసులు
వీఐపీ రాహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో (Punjagutta police station) కేసు నమోదైంది. 333, 353,337 సెక్షన్ల కింద షర్మిలపై (YSRTP leader YS Sharmila) పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
Hyd, Nov 29: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. వీఐపీ రాహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో (Punjagutta police station) కేసు నమోదైంది. 333, 353,337 సెక్షన్ల కింద షర్మిలపై (YSRTP leader YS Sharmila) పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నిన్న(సోమవారం) టీఆర్‌ఎస్ నేతల దాడిలో (TRS Leaders) ధ్వంసమైన కారును తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ సీఎం క్యాంప్ ఆఫీస్‌కు షర్మిల బయలుదేరిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాజ్‌భవన్ రోడ్డులో వైఎస్ షర్మిలను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. కారు అద్దాలు మూసివేసి వైఎస్ షర్మిల లోపలే కూర్చున్నారు. డోర్ లాక్ చేసి కారు దిగేందుకు నిరాకరించారు. దీంతో షర్మిల కారును క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అతి కష్టం మీద కారు డోర్లు తెరిచి షర్మిలను పోలీస్ స్టేషన్‌లోకి తీసుకెళ్లారు.పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్.. బందిపోట్ల రాష్ట్ర సమితిలా తయారైందన్నారు. ప్రజల కోసం పోరాడుతుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు.
కుమార్తె వైఎస్ షర్మిల అరెస్ట్ నేపథ్యంలో ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు బయల్దేరిన వైఎస్ విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ విజయమ్మను ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు రానీయకుండా ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ విజయమ్మ దీక్షకు దిగారు. ‘ కుమార్తెను చూడటానికి వెళ్తుంటే అడ్డుకుంటారా?, షర్మిల చేసిన నేరమేంటి?, ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా?, పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా?, ప్రజల కోసం నిరసన తెలపడం రాజ్యాంగ హక్కు. ప్రజా సమస్యలపైనే షర్మిల మాట్లాడుతోంది. షర్మిల వచ్చే వరకూ దీక్ష కొనసాగిస్తా’ అని విజయమ్మ మీడియాకు తెలిపారు.
షర్మిలను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆమె భర్త అనిల్ ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ.. ‘ పాదయాత్ర చేయడం తప్పా?, నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది’ అని తెలిపారు. మరొకవైపు వైఎస్ షర్మిలను ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌లోనే ఉంచడంతో వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దాంతో వైఎస్సార్‌టీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్ చేశారు. షర్మిల అరెస్ట్ నేపథ్యంలో ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పీఎస్‌కు షర్మిల అనుచరులు, వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ ముందు భవనం పైకి ఎక్కి వి వాంట్ జస్టిస్ అంటూ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.