Hayatnagar Mystery Death: ఒక్క మిస్డ్ కాల్ ఇద్దరి ప్రాణాలు తీసింది, 25 ఏళ్ల యువకుడిని పెళ్లిచేసుకునేందుకు 45 ఏళ్ల గవర్నమెంట్ టీచర్ డ్రామా, రెండు కుటుంబాల్లో చిచ్చు పెట్టిన ప్రేమవ్యవహారం
ఒక్క మిస్డ్ కాల్ (Missed Call) ఇద్దరి మృతికి కారణమైనట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయురాలి విపరీత ధోరణి చివరకు ఆమెతో సహా మరొకరి ఆత్మహత్యకు కారణమైంది. ములుగు జిల్లా పంచోత్కులపల్లికి చెందిన రాజేశ్ (25) మృతదేహం నగర శివారులోని హయత్‌నగర్ (Hayatnagar) సమీపంలోని కుంట్లూరులో ఈ నెల 29న లభించింది.
Hyderabad, May 31: హయత్‌నగర్ శివార్లో కుల్లినస్థితిలో దొరికిన మృతదేహం ఘటనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఒక్క మిస్డ్ కాల్ (Missed Call) ఇద్దరి మృతికి కారణమైనట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయురాలి విపరీత ధోరణి చివరకు ఆమెతో సహా మరొకరి ఆత్మహత్యకు కారణమైంది. ములుగు జిల్లా పంచోత్కులపల్లికి చెందిన రాజేశ్ (25) మృతదేహం నగర శివారులోని హయత్‌నగర్ (Hayatnagar) సమీపంలోని కుంట్లూరులో ఈ నెల 29న లభించింది. పోలీసులు ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం ఒక్క మిస్డ్‌కాల్‌తో రెండు నిండు ప్రాణాలు బలైనట్లు తెలుస్తోంది. హయత్‌నగర్‌లో (Hayatnagar) ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు (45) భర్త, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నారు. సుమారు ఏడాదిన్నర క్రితం ఆమె నుంచి రాజేశ్ సెల్‌ఫోన్‌కు మిస్డ్‌కాల్ వచ్చింది. పరస్పరం పలకరించుకోవడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆమె తనకు వివాహం కాలేదని చెప్పడం.. యువకుడికి కూడా పెళ్లి కాకపోవడంతో ఇద్దరూ చాటింగ్‌లు చేసుకున్నారు. వారి మధ్య చనువు ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. అనంతర కాలంలో వారిద్దరు కలిసి కారులో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరిగారు.
కలిసిన ప్రతిసారీ ఆమె తనను వివాహితగా గుర్తించకుండా ఉండేలా జాగ్రత్త పడుతూ వచ్చింది. ఆ క్రమంలో రాజేశ్ (Rajesh) ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. కొద్దిరోజులయ్యాక ఆమెకు వివాహమై ఉన్నత విద్య చదివే ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నట్లు రాజేశ్‌కు తెలిసింది. ఆమెను పెళ్లి చేసుకోవడం కుదరదని భావించిన యువకుడు రెండు నెలలుగా దూరం పెడుతూ వచ్చాడు. దీన్ని తట్టుకోలేకపోయిన ఆమె.. ‘నువ్వులేకుండా నేను ఉండలేను.. పురుగులమందు తాగి చనిపోతా’ అంటూ పలుమార్లు రాజేశ్ సెల్‌ఫోన్‌కు వాట్సప్ ద్వారా సందేశాలు పంపింది. ఈ నెల 24న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా కుటుంబసభ్యులు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందింది.
ఈ ఘటన అనంతరం ఉపాధ్యాయురాలి కుమారుడు తన తల్లి సెల్‌ఫోన్‌లోని వాట్సప్ చాట్‌లను పరిశీలించి ఆమె ఆత్మహత్యకు రాజేశ్ కారణమని నిర్ధారణకు వచ్చాడు. ఎలాగైనా అతడిని గుర్తించాలనే ఉద్దేశంతో స్నేహితుల సాయం కోరాడు. ఉపాధ్యాయురాలి మాదిరిగా యువకుడికి వాట్సప్ మెసేజ్‌లు పెడుతూ నమ్మించాడు. ఫలానా దగ్గర కలుద్దామంటూ సందేశం పంపగా రాజేశ్ హయత్‌నగర్ కుంట్లూర్ రోడ్డులోని ఓ టీస్టాల్ వద్దకు వచ్చి వేచి ఉన్నాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనాలపై వచ్చిన ఉపాధ్యాయురాలి కుమారుడు రాజేశ్‌ను డాక్టర్స్ కాలనీలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ నీవల్లే మా అమ్మ ఆత్మహత్యకు యత్నించిందంటూ దాడి చేశాడు. ఇకపై అమ్మ జోలికి రావద్దని హెచ్చరించాడు. ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురైన రాజేశ్ ఆత్మహత్యకు యత్నించాడు.
పురుగులమందు తాగిన రాజేశ్ డాక్టర్స్ కాలనీలోని కాంపౌండ్‌లోకి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుంటూ అక్కడే కుప్పకూలి మృతిచెందాడు. రాజేశ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా కొన్ని విషయాలు బహిర్గతమైనట్లు తెలిసింది. శరీరం లోపలి భాగాల్లో ఎక్కడా గాయాలైనట్లు, రక్తస్రావమైనట్లు ఆనవాళ్లు కనిపించలేదని సమాచారం. పురుగుల మందు తాగిన ఆనవాళ్లు గుర్తించినట్లు ప్రాథమికంగా తెలిసింది. పొట్టలోని స్రావాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం పూర్తయిన అనంతరం రాజేశ్ మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం అతడి కుటుంబ సభ్యులకు అప్పగించగా వారు పంచోత్కులపల్లికి తరలించారు.