Fire at Showroom in Hyderabad. (Photo Credits: Twitter)

Hyderabad, May 31: హైదరాబాద్‌ లోని ఎల్బీనగర్‌ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎల్బీ నగర్ చౌరస్తాకు సమీపంలో ఉన్న గుంటి జంగయ్య నగర్‌లోని ‘కార్‌ ఓ మ్యాన్‌’ గ్యారేజీ అగ్నికి ఆహుతైంది. ఓ గ్యాస్‌ సిలిండర్‌ భారీ శబ్దంతో పేలింది. ఈ ప్రమాదంలో సుమారు 20 కార్లు కాలిపోయినట్లు అంచనా. అగ్ని కీలలు రెండు గంటలపాటు అదుపులోకి రాలేదు. ఓ సమయంలో పక్కనున్నఅపార్ట్‌మెంట్లకు వ్యాపించేలా మంటలు అటువైపు సాగాయి. దాంతో విద్యుత్‌ సరఫరా నిలిపివేసి పలువురు బయటికి వచ్చారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించడంతో రాత్రి 10.30 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి.

గ్యారేజీ వెనుకనున్న గృహోపకరణాల షోరూంకు మంటలు అంటుకోకుండా సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఎల్బీనగర్‌ డీసీపీ సాయిశ్రీ మాట్లాడుతూ..నాలుగు కార్లను సురక్షితంగా బయటకు తీశామని, మిగిలినవి కాలిపోయాయన్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదన్నారు. కాగా గ్యారేజీ యజమాని విజయ్‌కుమార్‌ రాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని దాదాపు రూ.3 కోట్ల వరకు నష్టం వాటిల్లిందంటూ లబోదిబోమన్నారు. కాలిపోయిన కార్లను చూసి సొమ్మసిల్లి పడిపోయారు.