Vikarabad: తెలంగాణలో విషాదకర ఘటన, కల్తీ కల్లు తాగి 30 మందికి అస్వస్థత, ఒకరి పరిస్థితి విషమం, బాధిత కుటుంబాలను పరామర్శించిన వికారాబాద్, చేవెళ్ల ఎమ్మెల్యేలు
వికారాబాద్‌లో కల్తీ కల్లు తాగి ( drinking spurious toddy) రెండు గ్రామాల్లో దాదాపు 30 మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు.
Vikarabad, Jan 9: తెలంగాణ రాష్ట్రంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వికారాబాద్‌లో కల్తీ కల్లు తాగి ( drinking spurious toddy) రెండు గ్రామాల్లో దాదాపు 30 మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. వికారాబాద్ జిల్లా (Vikarabad) నవాబ్ పేట్ మండలం చిట్టిగిద్ద గ్రామంలో చెట్ల నుంచి తీసి తయారు చేస్తున్న కృత్రిమ కల్లును మండల పరిధిలోని చిట్టిగిద్ద, నవాబ్ పేట్, అర్కతల, వట్టిమీనపల్లి, ఎక్ మామిడి, కేశపల్లి, తిమ్మారెడ్డి పల్లి, మమ్దాన్పల్లి, వికారాబాద్ మండలం కొత్తగడి, నారాయణపూర్, ఎర్రవళ్లి, పాతూర్, కామరెడ్డిగూడ, పులుసుమామిడి గ్రామాలకు డీసీఎంలో గత కొంత కాలంగా సరఫరా చేస్తున్నారు.
అయితే ఎప్పటి మాదిరిగానే శుక్రవారం కూడా కల్లు సరఫరా చేశారు. ఆయా గ్రామాల్లో కల్లు సేవించిన వారిలో కొంతమంది అస్వస్థతకు గురికాగా.. ఎర్రవళ్లి, చిట్టిగిద్దకు చెందిన దాదాపు 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చిట్టిగిద్దకు చెందిన ప్యాట రాములు(65) పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిని వారివారి బంధువులు నవాపేట్ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు.
విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు గ్రామానికి చేరుకొని అస్వస్థతకు గలకారణాలను తెలుసుకుంటున్నారు. బాధిత కుటుంబాలను వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యలు పరామర్శించారు.