Khammam, July 2: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా వ్యవసాయ భూమి విషయంలో తనకు అన్యాయం జరిగిందనే ఆవేదనతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, మరో ముగ్గురు రైతులు సైతం ఆత్మహత్యకు యత్నించారు. పలు జిల్లాల పరిధిలో సోమవారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. రైతు రాజ్యంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని.. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించి తన కుటుంబానికి న్యాయం చేయాలని సెల్పీ వీడియో తీసుకుని రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
విషాదకర ఘటన వివరాల్లోకెళితే.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన బోజెడ్ల ప్రభాకర్ (45) కుటుంబానికి 7.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గ్రామంలోని చెరువు శిఖం పక్కనే ఉన్న తన భూమిలో ప్రభాకర్ గత వేసవిలో రూ.8 లక్షలు వెచ్చించి మట్టి తోలించాడు. అయితే చెరువు శిఖంలో మట్టి పోశారంటూ గ్రామానికి చెందిన మత్స్య సొసైటీ సభ్యులు నాలుగు రోజుల క్రితం రెండు జేసీబీలు, రెండు బుల్డోజర్లతో ప్రభాకర్ పొలంలోని మట్టిని తొలగించారు. యూపీఐ యాప్ లతో విద్యుత్ బిల్లుల చెల్లింపులు వద్దు.. అధికారిక వెబ్ సైట్, యాప్ లలో మాత్రమే చెల్లించాలంటూ టీజీఎస్‌పీడీఎల్ కీలక ప్రకటన
దీనిపై తహసీల్దార్, ఎస్సై, ఇరిగేషన్ అధికారులకు ప్రభాకర్ ఫిర్యాదు చేయగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు భూమిని పరిశీలించి మట్టి తొలగించొద్దని సొసైటీ సభ్యులకు చెప్పారు. అయినా వారు దౌర్జన్యంగా మట్టి తొలగించగా, గ్రీవెన్స్‌లో కలెక్టర్, సీపీని కలిసి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు తన తండ్రితో కలిసి ప్రభాకర్ సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌కు వెళ్లాడు. అక్కడ కలెక్టర్ కలవకపోవడంతో మనస్తాపానికి గురైన ప్రభాకర్.. భోజనం చేసి వస్తానంటూ తండ్రితో చెప్పి ఖమ్మంలోని గొల్లగూడెం – కొత్తగూడెం మార్గంలో గల చెరుకూరి గార్డెన్ వద్దకు పురుగుల మందు డబ్బాతో చేరుకున్నాడు.
Here's Video
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య.
నేను చనిపోతున్న నా ఆవేదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం బట్టి గారికి ఈ వీడియో ద్వారా తెలియజేయండి అంటూ రైతు ఆత్మహత్య..
చింతకాని మండలం పొద్దుటూరులో జరిగిన సంచలన ఆత్మహత్య
రైతు భోజడ్ల ప్రభాకర్ తీవ్ర మనస్థాపనతో పురుగుమందు తాగి… pic.twitter.com/3S7H8v4dvx
— Aadhan Telugu (@AadhanTelugu) July 2, 2024
తనకు జరిగిన అన్యాయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా వివరిస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లగా అప్పటికే మృతి చెందాడు. గ్రామంలోని కొందరు కాంగ్రెస్, టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే తన పొలాన్ని నాశనం చేశారని వివరిస్తూ తాను ఆత్మహత్య చేసుకునే ముందు తీసిన వీడియోను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు పంపించాలని, తన కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభాకర్ కోరాడు.
మరో ఘటనలో జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రానికి చెందిన అక్కాచెల్లెళ్లు , స్వప్నల పేరిట తాత లక్ష్మయ్య 1.04 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయించి గార్డియన్‌గా ఉన్నాడు. ఆ విషయం అక్కాచెల్లెళ్లకు తెలియదు.2014లో లక్ష్మయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. జ్యోతి, స్వప్నలకు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ట్రంకు పెట్టె సర్దుతుండగా, భూమి విషయం తెలిసింది. వెంటనే జ్యోతి గ్రామానికి చెందిన సదరు వ్యక్తిని భూమి విషయం అడగ్గా, మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది.
న్యాయం కోసం జ్యోతి గతంలో నర్మెట పీఎస్‌కు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేయగా, పోలీసులు నచ్చచెప్పి ఇంటికి పంపించారు. ఆ తర్వాత జ్యోతి కోర్టును ఆశ్రయించింది. కేసు నడుస్తోంది. భూమి వస్తుందో రాదో అన్న ఆవేదనతో జ్యోతి కొన్ని మందుగోలీలు మింగి సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు వచ్చింది. ప్రజావాణి ప్రారంభమయ్యే క్రమంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు.
ఇక నాగర్‌కర్నూల్ జిల్లా లింగాలకు చెందిన మహిళారైతు గాలేటి జయమ్మకు గ్రామ శివారులో 1.37 ఎకరాల భూమి వారసత్వంగా దక్కాల్సి ఉంది. ఆ భూమిని పదేళ్ల కిందట అధికారులు ఇతరుల పేరిట పట్టా చేశారు. అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో ఆందోళనకు గురైన జయమ్మ సోమవారం పెట్రోల్‌తో లింగాల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఒంటిపై పోసుకునేందుకు ప్రయత్నించింది. గమనించిన చుట్టుపక్కల వారు అడ్డుకున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన రైతు పరుశరాముడికి అదే గ్రామ శివారులో ఐదు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని గ్రామనేతలు కబ్జా చేశారు. దీనిపై పరుశరాముడు పలుమార్లు రెవెన్యూ అధికారులతో పాటు కలెక్టరేట్‌లో కూడా ఫిర్యాదు చేశాడు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. సోమవారం గద్వాల కలెక్టరేట్‌లో కలెక్టర్ బీఎం.సంతోష్ ఆధ్వర్యంలో ఫిర్యాదుల దినోత్సవం కొనసాగుతుండగానే పరుశరాముడు తన వెంట తీసుకొచ్చిన పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం రైతు పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.