Hyderabad Break Biryani Records: రంజాన్ నెలలో రికార్డులు బద్దలు కొట్టిన హైదరాబాదీలు, ఆ ఒక్క యాప్ నుంచే ఏకంగా 10 లక్షల బిర్యానీలు ఆర్డర్, ఇక ఎన్ని హలీమ్స్ ఆర్డర్ చేశారంటే?
ఈ ఏడాది రంజాన్ మాసం మార్చి 11న ప్రారంభమైన విషయం తెలిసిందే.
Hyderabad, April 11: బిర్యానీ (Biryani) అంటే ఇష్టపడని వారెవరైనా ఉంటారా..? చెప్పండి. ఆ వాసనకే కడుపు నిండిపోతోంది. ఇక మన హైదరాబాద్ బిర్యానీ (Hyderaba Biryani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశం మొంత్తంగా హైదరాబాద్ బిర్యానీ టాప్‌లో ఉంటుంది. విదేశీయులు కూడా ఈ బిర్యానీని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇతర రాష్ట్రాల ప్రజలు నగరానికి వస్తే కచ్చితంగా బిర్యానీ తినకుండా వెనుతిరిగి వెళ్లరు. అంతటి రుచికరమైన బిర్యానీని రంజాన్ మాసం (Ramadan Month) సందర్భంగా నగరవాసులు తెగ లాగించేశారట. ఈ రంజాన్ నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా పది లక్షల పేట్ల బిర్యానీ ఆర్డర్లు (A Million Plates Of Biryani) వచ్చినట్లు ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది రంజాన్ మాసం మార్చి 11న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇవాళ్టితో ముగిసింది. దీంతో మార్చి 11 నుంచి ఏప్రిల్ 8 వరకూ దేశవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ ఆర్డర్ల గురించి వివరాలను స్విగ్గీ తాజాగా వెల్లడించింది. ఈ నెల రోజుల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 60 లక్షల పేట్ల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. సాధారణ రోజుల కంటే ఇవి 15 శాతం ఎక్కువ అని పేర్కొంది.
ఇక దేశవ్యాప్తంగా బిర్యానీ ఆర్డర్లలో హైదరాబాద్ టాప్‌లో ఉన్నట్లు స్విగ్గీ వెల్లడించింది. నెల రోజుల్లోనే 10 లక్షల పేట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. బిర్యానీతోపాటు హలీమ్ ఆర్డర్లలోనూ నగరవాసులు రికార్డు సృష్టించినట్లు తెలిపింది. ఈ నెలలో ఏకంగా 5.3 లక్షల హలీమ్ ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. రంజాన్ మాసం సందర్భంగా సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు ఇఫ్తార్ ఆర్డర్లు 34 శాతం పెరిగాయని తెలిపింది.
ఆర్డర్లలో ఎక్కువగా చికెన్, మటన్ బిర్యానీ, హలీమ్, సమోసా, ఫలుదా, ఖీర్ ఉన్నాయని స్విగ్గీ తెలిపింది. మొత్తంగా హలీమ్ ఆర్డర్లు 1454.88 శాతం, ఫిర్ని 80.97 శాతం పెరిగినట్లు తెలిపింది. మాల్పువా ఆర్డర్లు 79.09 శాతం, ఫలుదా 57,93 శాతం, డేట్స్ 48.40 శాతం ఆర్డర్లు పెరిగినట్లు తెలిపింది. ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, భోపాల్, మీరట్‌లో ఇఫ్తార్ స్వీట్ డిష్‌ల ఆర్డర్‌లు గణనీయంగా పెరిగినట్లు స్విగ్గీ వెల్లడించింది.