Steel Bridge: లోయర్ ట్యాంక్ బండ్ వద్ద రూ. 450 కోట్లతో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం.. నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ లో ఇవాళ ఈ రూట్ లో వెళ్లొద్దు
Hyderabad, Aug 19: హైదరాబాద్ లోని (Hyderabad) లోయర్ ట్యాంక్ బండ్ వద్ద స్టీల్ బ్రిడ్జ్ (Steel Bridge) ప్రారంభం సందర్భంగా నేటి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) అమల్లో ఉండనున్నాయి. ఇందిరాపార్కు (Indira Park) నుంచి వీఎస్‌టీ (VST) వరకు రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జ్ ను నేడు రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు ప్రారంభించనున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు
ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ నగర అదనపు ట్రాఫిక్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ నుంచి ఇందిరాపార్క్ ఎక్స్ రోడ్ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. కట్టమైసమ్మ దేవాలయం వద్ద లోయర్ ట్యాంక్‌బండ్, తహసీల్దార్ కార్యాలయం, స్విమ్మింగ్ పూల్, ఇందిరాపార్క్ ఎక్స్ రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి కట్టమైసమ్మ దేవాలయం వైపు వచ్చే ట్రాఫిక్ ను అనుమతించరు. ఇందిరాపార్క్ ఎక్స్ రోడ్డు వద్ద బండ మైసమ్మ, స్విమ్మింగ్ పూల్, ఎమ్మార్వో కార్యాలయం, లోయర్ ట్యాంక్ బండ్ వైపు ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని సుధీర్‌బాబు కోరారు.