Transgender Desk: హిజ్రాలతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ భేటీ, తెలంగాణలోనే తొలిసారి..సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా డెస్క్ ప్రారంభించిన ససైబరాబాద్ పోలీస్ శాఖ, సమస్యలేవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచన
సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశానికి నగరం నలుమూలల నుంచి 150 మంది ట్రాన్స్‌జెండర్లు హాజరయ్యారు.
Hyderabad, Feb 20: తెలంగాణ చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్‌లోని ట్రాన్స్‌జెండర్లతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (Cyberabad cp vc sajjanar) నిన్న సమావేశమయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశానికి నగరం నలుమూలల నుంచి 150 మంది ట్రాన్స్‌జెండర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ట్రాన్స్‌జెండర్ డెస్క్(Transgender Desk) ప్రారంభించారు.దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ శుక్రవారం తెలిపారు.
ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతాకృష్ణన్ అభ్యర్థ మేరకు ఈ డెస్క్ ప్రారంభమైంది. మహిళ, శిశు భద్రత విభాగం ఆధ్వర్యంలో ఈ డెస్క్ పనిచేస్తుందని పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్లకు ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సునీత్ కృష్ణన్ మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్ల సమస్యల్లో విద్య, ఉపాధి వంటివి ఉన్నాయని అన్నారు. వారికి అద్దెకు ఇళ్లు దొరకడం లేదని, సన్నిహిత భాగస్వాముల వేధింపులు, వీధుల్లో హింస వంటివి వారు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటి పరిష్కారానికి ఈ డెస్క్ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికి తమవైపు నుంచి అన్ని చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హామీ ఇచ్చారు.
వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పోలీస్ అధికారులు హామీ ఇచ్చారు. ఏమైనా ఇబ్బందులుంటే సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444కు తెలియజేయాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు.