Telangana Green Fund: తెలంగాణ హరిత నిధి, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు జీతాల నుంచి కొంత పండ్ జమ చేయాలని కోరిన కేసీఆర్, నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ అసెంబ్లీ
తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెంచడం కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి తెలంగాణ హరిత నిధి (తెలంగాణ గ్రీన్‌ఫండ్)ను (Telangana Green Fund) ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతినెలా కొంత మొత్తాన్ని ఈ ఫండ్‌కు (Telangana Haritha Fund) జమ చేయాలని కోరారు.
Hyd, Oct 2: తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెంచడం కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి తెలంగాణ హరిత నిధి (తెలంగాణ గ్రీన్‌ఫండ్)ను (Telangana Green Fund) ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతినెలా కొంత మొత్తాన్ని ఈ ఫండ్‌కు (Telangana Haritha Fund) జమ చేయాలని కోరారు. దీనితోపాటు పలు ఇతర మార్గాల ద్వారా గ్రీన్‌ఫండ్‌కు నిధులు సమకూర్చుతామని వెల్లడించారు.
శుక్రవారం శాసనసభలో (TS Monsoon Assembly Seassion 2021) హరితహారం అంశంపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ‘హరితనిధి’ ఏర్పాటుతోపాటు ఇతర ప్రతిపాదనలను వివరించారు. రాష్ట్రంలో అడవులు నాశనం అవుతున్నాయి. ప్రణాళికబద్ధంగా పచ్చదనం పెంచాల్సిన అవసరముంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించింది. హరితహారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు హరితనిధిని (harithaharam programme) ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు తమ వంతుగా ఆర్థిక సాయం చేయాలి.
ఈ విషయంగా అఖిలభారత సర్వీసులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో మాట్లాడాం. ప్రతినెలా జీతాల నుంచి చెల్లించేందుకు వారు అంగీకరించారు. మొత్తం 184 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల నుంచి నెలకు రూ.500 చొప్పున చెల్లించాలని కోరాం. దీనికి టీఆర్‌ఎస్ సభ్యులందరూ సమ్మతం తెలిపారు. ప్రతిపక్షాల నేతలు కూడా సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నాం. తెలంగాణ హరితనిధి దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది.
ప్రపంచంలో గ్రీనరీ విషయంగా తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో కెనడా, రెండో స్థానంలో బ్రెజిల్, మూడో స్థానంలో రాష్ట్రం ఉంది. రాష్ట్రంలో మొత్తం 2.75 కోట్ల ఎకరాల భూమి ఉంది. అందులో 66.25 లక్షల ఎకరాల మేర అటవీ భూములు ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌లో ఒకప్పుడు అద్భుతమైన అడవులు ఉండేవి. ఇప్పుడు మాయమైపోయాయి. నర్సాపూర్ అడవులు మన కళ్ల ముందే ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలోనే హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు.
మొత్తంగా రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటాలని హరితహారం లక్ష్యంగా పెట్టుకున్నాం. సిద్దిపేటలో 20కోట్ల మొక్కలు లక్ష్యంగా పెట్టుకుంటే, ఇప్పటికే 20.64 కోట్ల మొక్కలు నాటాం. గ్రేటర్ హైదరాబాద్, హెచ్‌ఎండీఏ పరిధిలో 10 కోట్ల మొక్కలు టార్గెట్ పెట్టుకుంటే 14.5 కోట్ల మొక్కలు నాటాం. అటవీ ప్రాంతాల బయట 130కోట్లు టార్గెట్‌గా పెట్టుకుంటే, 176.82 కోట్లు నాటాం. హైదరాబాద్ ఎకో సిస్టం నిర్వహణకు 188 రిజర్వు ఫారెస్ట్ బ్లాక్‌లున్నాయి. 1.60 లక్షల ఎకరాల భూమి ఉంది. వాటిని గోడలు, కంచెలతో రక్షిస్తున్నాం. గ్రామాలు, మున్సిపాలిటీల్లో పచ్చదనం పెంచడా నికి 10% బడ్జెట్‌ను గ్రీనరీకే పెట్టాం. మొక్కల బాధ్యత సర్పంచ్‌లకు అప్పగించాం. ఎమ్మెల్యేలు గ్రామాల్లో తనిఖీలు చేసి మొక్కల పరిస్థితిని పరిశీలించాలని తెలిపారు.
19,472 ఆవాసాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశాం. మండలానికి ఒకటి లెక్కన బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. 526 మండలాల్లోని 7,178 ఎకరాల్లో ప్లాంటేషన్ పనులు విస్తృతంగా జరుగుతున్నాయి. పట్టణాల్లోని 109 ఏరియాల్లో మొత్తంగా 75,740 ఎకరాల్లో అర్బన్ ¯ఫారెస్టులు ఏర్పాటు చేస్తున్నాం. 53 అర్బన్ పార్కుల్లో పని బాగా జరిగింది. మిగతాచోట్ల కొనసాగుతున్నాయని అన్నారు.
కంపా నిధులు కేంద్ర ప్రభుత్వానివి కావు. 100 శాతం రాష్ట్రాల డబ్బే. నీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర అవసరాల కోసం అటవీ భూములు తీసుకుం టాం. ఇందుకోసం అడ్వాన్స్ కింద రాష్ట్రాలు కేంద్రానికి డబ్బు చెల్లించాలి. ఇలా తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లిన సొమ్ము రూ.4,675 కోట్లు. ఈ నిధులనే తిరిగి రాష్ట్రానికి విడుదల చేయాలని ప్రధాని మోదీని కలిసి కోరాం. నాలుగేళ్ల తర్వాత రూ.3,109 కోట్లు విడుదల చేశారు. అందులో రూ.1,320 కోట్లు ఖర్చు పెట్టాం. ఉపాధి హామీ కింద రూ.3,673 కోట్లు ఖర్చు చేశాం. హెచ్‌ఎండీఏ ద్వారా రూ.367 కోట్లు, జీహెచ్‌ఎంసీ ద్వారా రూ.83 కోట్లు ఖర్చు పెట్టాం. నర్సరీల పెంపకం, కూలీలు, మొక్కల సరఫరా, నీటి రవాణాకు ఈ నిధులు వినియోగించాం. ఎక్కడా దుర్వినియోగం లేదు. ఇప్పటివరకు హరితహారం కోసం రూ.6,555 కోట్లు ఖర్చు చేశామన్నారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అసైన్డ్ భూములను ప్రభుత్వం లాగేసుకుంటోందన్న ప్రతిపక్ష సభ్యుల విమర్శలపై సీఎం కేసీఆర్ స్పందించారు. ‘‘అభివృద్ధి కార్యక్రమాల కోసం అనివార్య పరిస్థితుల్లోనే అసైన్డ్ భూములను తీసుకుంటున్నాం. వంద ఎకరాలను దళితులకు అసైన్ చేశామని అనుకుందాం. మరి ఆ భూములకు నీరివ్వాలంటే కాల్వను ఆ భూముల నుంచే తవ్వాలి. అందువల్ల కొంత భూమి తీసుకోవాల్సి వస్తుంది. పట్టా భూమి ఉన్నవారికి ఎంత పరిహారం ఇస్తామో, వీరికీ అంతే పరిహారం ఇస్తున్నాం. అనవసరంగా తీసుకున్నవి ఎక్కడైనా ఉంటే చెప్పండి. కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ’’ అని స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన సమయంలో ఇష్టమున్నట్టు గీతలు గీసి భద్రాచలం నియోజకవర్గంలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారని, తమ ప్రజలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య అసెంబ్లీలో ప్రస్తావించగా.. సీఎం కేసీఆర్ స్పందించారు. ‘‘ఏడు మండలాలను ఇష్టమొచ్చినట్టుగా ఏపీలో కలిపారు. అది ఫాసిస్ట్ పద్ధతి. ఈ విషయంగా ప్రధానమంత్రితోనూ గొడవపడ్డాను. గతంలో చంద్రబాబు, వెంకయ్యనాయుడులకూ చెప్పాను. ప్రస్తుతం అక్కడ వేరే ప్రభుత్వం ఉంది..’’ అని పేర్కొన్నారు.
ఎవరి నుంచి ఎంత?
ప్రతి నెలా ప్రజాప్రతినిధుల వేతనాల్లో..
రూ.500 ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
రూ.100 జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు
రూ.50 మున్సిపల్ చైర్ పర్సన్, ఎంపీపీ, జడ్పీటీసీలు
రూ.10 మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, కార్పొరేటర్లు
అఖిల భారత సర్వీసులు:
రూ.100 ఐఏఎస్,ఐపీఎస్,ఐఎఫ్‌ఎస్ అధికారులు
రూ.25 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి
0.1%ప్రభుత్వ పనులు చేపట్టే సివిల్ తదితర కాంట్రాక్టు నిధుల్లోంచి
10% నియోజకవర్గ అభివృద్ధి నిధి నుంచి
రూ.50 ప్రతి రిజిస్ట్రేషన్ నుంచి
రూ.1000 వ్యాపార సంస్థల ప్రతి లైసెన్సు రెన్యువల్ నుంచి
విద్యార్థుల అడ్మిషన్ల నుంచి…
రూ.10 ప్రతి సూల్ అడ్మిషన్‌కు
రూ.15 ఇంటర్మీడియట్ అడ్మిషన్‌కు
రూ.25 డిగ్రీ అడ్మిషన్‌కు
రూ.100 ప్రొఫెషనల్ కాలేజీ అడ్మిషన్‌కు
నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపిన అసెంబ్లీ
తెలంగాణ శాసనసభ నాలుగు బిల్లులను శుక్రవారం ఆమోదించింది. గృహ నిర్మాణ మండలిని రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా గుర్తించడంతో పాటు ముగ్గురు సభ్యులను నామినేట్ చేసేలా సవరించిన తెలంగాణ గృహ నిర్మాణమండలి (సవరణ) బిల్లు–2021ను గృహ నిర్మాణమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రతిపాదించగా సభ ఆమోదించింది. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్‌ఆర్‌ఐ), హార్టీకల్చర్ పాలిటెక్నిక్ కాలేజీల అనుబంధాన్ని అనుమతించేందుకు ఉద్దేశించిన ఉద్యాన విశ్వవిద్యాలయ సవరణ బిల్లు– 2021ని కూడా సభ ఆమోదించింది.
జాతీయ న్యాయ శాస్త్ర అధ్యయనాలు, పరిశోధనల అకాడమీ విశ్వవిద్యాలయం (నల్సార్)లో తెలంగాణ విద్యార్థుల కోటాను 20 నుంచి 25 శాతానికి పెంచడంతోపాటు ఈ 25 శాతం కోటాలో బీసీలు, ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పించే నల్సార్ సవరణ బిల్లు–2021కు సైతం శాసనసభ ఆమోదం తెలిపింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని కొత్త గ్రామాల ఏర్పాటు, ఏదైనా గ్రామం విస్తీర్ణాన్ని పెంచడం లేదా తగ్గించడం, పేరు, హద్దుల మార్పునకు ఉద్దేశించిన పంచాయతీరాజ్ సవరణ బిల్లులోని పేరుమార్పు నిబంధనలపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పేరుమార్పు నిబంధనను తొలగించాలని పట్టుబట్టడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది.
పేరుమార్పు నిబంధనపై నిరసన తెలుపుతున్నట్లు అక్బరుద్దీన్ ప్రకటించగా సవరణ బిల్లును ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. శుక్రవారం మరో రెండు బిల్లులు సభ ముందుకు వచ్చాయి. తెలంగాణ వస్తుసేవల పన్ను సవరణ బిల్లును మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించారు. రాష్ట్ర పర్యాటకులు, ప్రయాణికులపై దళారీతనం, దుష్ప్రవర్తనను నివారించే బిల్లును హోంమంత్రి మహమూద్ అలీ సభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ బిల్లుల ఆమోదం తర్వాత శాసనసభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు. కాగా, వర్షాల మూలంగా సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో శాసనసభ సమావేశాలకు విరామం ప్రకటించడంతో ఈ నెల 7 వరకు సమావేశాలను పొడిగించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. అయితే దీనిపై ఈ నెల 5న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)