Cyclone-Rain-forecast- (Photo-Twitter)

New Delhi, Oct 2: గులాబ్‌ తుపాను కల్లోలం మరచిపోకముందే దేశంపై మరో తుపాను విరుచుకుపడేందుకు రెడీ అయింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్‌ తుపాను (Cyclone Shaheen) క్రమంగా బలపడుతోంది. ఏడు రాష్ట్రాల్లో (Heavy rains predicted in these 7 states) ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ శుక్రవారం హెచ్చరించింది. గుజరాత్, బిహార్, పశ్చిమబెంగాల్, సిక్కిం, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఉత్తర అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్‌ తుపాను మధ్య అరేబియా తీర ప్రాంతాలవైపు దూసుకొస్తోంది. ఆ తర్వాత అది తీవ్ర తుపానుగా మారి పాకిస్తాన్‌లో మాక్రన్‌ తీర ప్రాంతాన్ని తాకుతుంది.అనంతరం ఒమన్‌ తీరం వైపుగా కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని ఐఎండి వెల్లడించింది. 36 గంటల్లో దిశ మార్చుకొని గల్ఫ్‌ ప్రాంతాలపై వెళ్లి ఆ తర్వాత బలహీనపడుతుందని వెల్లడించింది. గులాబ్‌ తుపాను ప్రభావం కారణంగా ఏర్పడిన షహీన్‌ తుపానుతో ఏడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

కాగా గులాబ్‌ తుపాను ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తీరం దాటిన వారం రోజుల తర్వాత ఈ షహీన్‌ తుపాను భారతదేశ తీరానికి దూరంగా వెళుతోంది. మత్స్యకారులు శనివారం వరకు ఆరేబియా సముద్రంలో వేటకు వెళ్లవద్దని ఐఎండి హెచ్చరించింది. ఇప్పటికే వెళ్లిన వారెవరైనా ఉంటే వెంటనే వెనక్కు వచ్చేయాలని సూచించింది. షహీన్‌ ప్రభావంతో ఆదివారం వరకు గుజరాత్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, సిక్కింలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సోమవారం వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

తెలుగు రాష్ట్రాలను వణికించిన గులాబ్ తుఫాన్

పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాలను కొన్ని రోజుల నుంచి కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. నదులు పొంగుతుండటంతో అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పశ్చిమ బర్ధమన్‌, హౌరా, హౌగ్లీ, బంకుర జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. అలీపూర్‌దౌర్‌, కుచ్‌బెహార్‌, డార్జిలింగ్‌, కలింపూంగ్‌, జల్‌పైగురి, దక్షిణా ఉత్తర దినజ్‌పూర్‌ జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సహాయక చర్యల్లో జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్‌), రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (ఎస్‌డిఆర్‌ఎఫ్‌), స్థానిక అధికారులతో పాటు సైన్యం కూడా పాలుపంచుకుంటుంది. వరద బాధిత ప్రాంతాల నుంచి సైన్యం ఇప్పటి వరకూ 91 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.

పశ్చిమ బర్ధమన్‌ జిల్లాలోని అసంసోల్‌లో 24 గంటల్లో రికార్డు స్థాయిలో అత్యధికంగా 434.5 మీమీ వర్షపాతం కురిసింది. బంకురా జిల్లా కేంద్రం బంకురాలోనూ 354.5 మీమీ వర్షపాతం నమోదయింది. మిగిలిన ప్రాంతాల్లోనూ రికార్థుసాయిలో వర్షపాతాలు నమోదవుతున్నాయి. భారీవర్షాలతో దారకేశ్వర్‌, అజరు వంటి నదులు పొంగిపొర్లుతున్నాయి. పంటపొలాలను ముంచెత్తుతున్నాయి.