Telangana Weather Forecast: తెలంగాణలో చలి పంజా, మరో మూడు రోజుల పాటు వణుకు తప్పదంటున్న వాతావరణ శాఖ, ఏపీలో రోజు రోజుకు తీవ్రమవుతున్న చలి

రోజు రోజుకు తీవ్రత (Telangana Weather Forecast) పెరుగుతున్నది. ఒకేసారి రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ( Telangana as winter peaks ) తక్కువగా నమోదవుతున్నాయి.

Weather Forecast (Photo Credits: IANS)

Hyd, Dec 21: తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. రోజు రోజుకు తీవ్రత (Telangana Weather Forecast) పెరుగుతున్నది. ఒకేసారి రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ( Telangana as winter peaks ) తక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగత్రలు గతంలో ఎన్నడూ లేని విధంగా తగ్గుముఖం పడుతున్నాయి. నేటి నుంచి మరో మూడు రోజుల పాటు చలి (TS Weather Report) పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉదయం 10 గంటలైనా చలిమాత్రం వదలడం లేదు. కొన్ని రోజులుగా అన్ని జిల్లాల్లో చలి విజృంభిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాను వణికిస్తోంది.

మంగళవారం వేకువ జాము నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు భారీగా కమ్మేసింది. ఈశాన్య భారత నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో శీతల గాలులు ఉధృతంగా వీస్తున్నాయి. చలికి తోడు గాలులు కూడా వీస్తుండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గత ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. గిన్నెదరిలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 3.5 డిగ్రీలకు పడిపోయింది. సిర్పూర్‌ – యూలో 4 డిగ్రీలకు పడిపోయింది. ఇక వాంకిడిలో 5 డిగ్రీలు, మాంగృడ్‌లో 5.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణలో కొత్తగా 156 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 53 కొత్త కేసులు

సాయంత్రమైందంటే గాలుల తీవ్రత పెరుగుతున్నది. ఇదిలా ఉండగా.. చలి తీవ్రత ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీగా పెరిగింది. మంగళవారం ఉదయం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా గిన్నెదరిలో ఉష్ణోగ్రతలు 3.5 డిగ్రీలకు పడిపోయాయి. అలాగే బేలా, సిర్పూర్‌ (యూ)లో 3.8, అర్లి(టీ) 3.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే వాంకిడిలో 4.9, జైనథ్‌లో వాంకిడి లో 4.9, చాప్రాలలో 5.1, సోనాలా లో 5.2, బజార్‌హత్నూర్‌లో 5.3, లోకిరిలో 5.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని టీఎస్‌ డీపీఎస్‌ పేర్కొంది. చలితీవ్రతకు జనం వణుకుతున్నారు. దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా వాహనదారులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు.

సింగిల్‌ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో.. ప్రజలు బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. పట్టపగలైనా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఏజెన్సీలో వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఏజెన్సీ మొత్తం చలి గుప్పిట్లో చిక్కుకుంది. ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండడంతో జనం గజగజ వణికిపోతున్నారు. ఉదయం పూట విధులు నిర్వర్తించే పారిశుద్ద్య కార్మికులు, పాలు సరఫరా చేసే వారు పెరిగిన చలితో ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. ఉదయం స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగరీత్యా రాకపోకలు సాగించే ఎంప్లాయీస్‌ సైతం చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆదిలాబాద్‌ ఏజెన్సీని మొత్తం పొగమంచు కమ్మేయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో చలి నుంచి ఉపశమనం పొందేందుకు నెగళ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు రక్షణ లేకుండా చలిలో బయటకు వెళ్తే.. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఉమ్మడి కరీనంగర్‌ జిల్లా వాసులనూ చలి వణికిస్తోంది. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా.. 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గాయి. దీంతో జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. ఈనెల 14న కరీంనగర్‌లో 16.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా…. నాలుగు రోజులుగా ఇది 11 డిగ్రీలకు పడిపోయింది. నిన్న ఇది మరింత పడిపోయి 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఏపీలో చలిపంజా

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తూర్పు మన్యంలోని మారేడుమిల్లిని చలి వణికిస్తుంది. చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ర్టంలో వరుసగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తన ప్రభావాన్ని చూపిస్తుంది. పగటి పూట సైతం చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఇంకా ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

మారేడు మిల్లిలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైంది.ఈ ఏడాది ఇదే అత్యల్పం. చలి తీవ్రత తగ్గకపోవడంతో వృద్ధులు, చంటి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. అటు వాహనాదారులు హెడ్‌ లైట్ల వెలుతురులోనే రాకపోకలు సాగిస్తున్నా తీవ్ర మంచుపొగ ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు విశాఖ ఏజెన్సీలో సైతం చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయిపోయాయి. దీంతో ఉదయం పూట పనులకు వెళ్తున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు.