Telangana RTC strike: నేటి అర్ధరాత్రితో సీఎం విధించిన డెడ్‌లైన్ గడువు ముగింపు, ఎన్ని డెడ్‌లైన్‌లు పెట్టినా విధుల్లోకి చేరేది లేదని ఆర్టీసీ జేఏసీ తెగింపు, ఇదే స్పూర్థి చూపాలని కార్మికులకు అశ్వత్థామ రెడ్డి పిలుపు

కార్మికులంతా....

RTC leader Ashwatthama Reddy face off with CM KCR | File Photo

Hyderabad, November 5: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె (TSRTC Strike) నేటితో 32వ రోజుకు చేరుకుంది. సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్ (CM KCR) విధించిన డెడ్ లైన్ ఈరోజు అర్ధరాత్రితో ముగియనుంది. "ఆర్టీసీ కార్మికులకు మరొక్క అవకాశం ప్రభుత్వం ఇస్తుంది, యూనియన్ల మాయలో పడకుండా మీ కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని నవంబర్ 05వరకు బేషరతుగా విధుల్లో చేరండి, మీకు తగిన రక్షణ కల్పిస్తాం, నవంబర్ 05 అర్ధరాత్రి దాటితే ఆపై కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకోం, మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోండి, ఈ అవకాశాన్ని వియోగించుకోండి" అని కేసీఆర్ కార్మికులకు ఆదివారం రోజే స్పష్టం చేశారు, ఆ తర్వాత సోమవారం నాడు ఇదే విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.

అయితే సీఎం విధించిన గడువు నేటితో ముగుస్తుండటంతో ఆర్టీసీ ఐకాస (RTC JAC) నాయకులు మరోసారి సమావేశం అయ్యారు. ఈ కీలక భేటిలో పలు రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, ప్రజాసంఘాలతో ఐకాస నాయకులు చర్చలు జరిపారు. అనంతరం అశ్వత్థామ రెడ్డి (Ashwatthama Reddy) మాట్లాడుతూ, సీఎం ఎన్ని డైడ్ లైన్లు పెట్టినా, బెదిరింపులకు పాల్పడినా తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు కార్మికులెవ్వరూ విధుల్లో చేరేది లేదని మరోసారి తేల్చిచెప్పారు. కార్మికులంతా ఇదే పోరాట పటిమ కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్‌కు ఆ అధికారం లేదు

సీఎం కేసీఆర్ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు, నవంబర్ 05 లోపు విధుల్లోకి చేరకుంటే ఆర్టీసీ ఉండదని కేసీఆర్ అన్నారు. అసలు ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశం కేంద్రం పరిధిలోనిది. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు అని ఆర్టీసీ జేఏసీ మరియు తెలంగాణ రాజకీయ జేఏసీ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆర్టీసీలో కేంద్రం వాటా 31 శాతం ఉంది, కాబట్టి కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేటీకరణ కుదరదు. అలాగే ఏపీఎస్ ఆర్టీసీ నుంచి టీఎస్ ఆర్టీసీ విభజన పూర్తిగా జరగలేదు కాబట్టి కేంద్రం ఆమోదం లేకుండా ఎలాంటి ప్రైవేటీకరణ సాధ్యం కాదు.

ఇలాంటి అంశాలేవీ పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలతో, బెదిరింపు ధోరణితో, విచిత్ర పదజాలంతో కేసీఆర్ కార్మికులను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించడం ఖండిస్తున్నామని అశ్వత్థామ రెడ్డి పేర్కొన్నారు. ఏదైనా సమస్య వచ్చినపుడు కూర్చుని చర్చించకుండా బెదిరింపులకు పాల్పడటం ముఖ్యమంత్రికి తగదని ఆయన అన్నారు.

కార్మికులెవరూ భయపడకూడదని, ముందుగా నిర్ణయించిన ప్రకారమే సమ్మెను యధావిధిగా కొనసాగించాలని అశ్వత్థామ రెడ్డి పిలుపునిచ్చారు.



సంబంధిత వార్తలు