TSRTC Strike Stir: టీఎస్ ఆర్టీసీపై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా, ప్రభుత్వ నివేదిక అస్పష్టంగా ఉందన్న హైకోర్ట్, ఈరోజు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న టీఎస్ ఆర్టీసీ ఐకాస
ఈరోజు సాయంత్రం....
Hyderabad, October 10: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె (TSRTC Strike) వివాదంపై ఈనెల 6న హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఈరోజు మరోసారి హైకోర్టులో వాదనలు జరిగాయి. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందజేసింది. సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేశామని వివరించారు. పండగ సమయంలో కార్మికులు ఇలా సమ్మె బాటపట్టడం సరికాదని అడ్వొకేట్ జనరల్ వాదించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమ్మెను విరమించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు.
మరోవైపు తమ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చేవరకు సమ్మె కొనసాగిస్తామని ఇటు కార్మిక సంఘాలు తమ వాదనలు వినిపించాయి. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం (High Court of Telangana) ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ అస్పష్టంగా ఉందని, ఈనెల 15లోగా పూర్తి వివరాలతో రిపోర్ట్ సమర్పించాలని అలాగే కార్మిక సంఘాలూ దానికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ మరోసారి హైకోర్ట్ ఈ కేసు విచారణను వాయిదా వేసింది.
కాగా, తమ ఉద్యోగాలకు వచ్చిన ముప్పేమి లేదని, కార్మికులు ధైర్యంగా ఉంటూ ఇదే స్పూర్థితో సమ్మెను కొనసాగించాలని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు సాయంత్రం ఐకాస నాయకులు తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు.
అక్టోబర్ 05వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. సమ్మెను నివారించడానికి ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీ, కార్మిక సంఘాలతో చర్చలు జరిపినా లాభం లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం సీరియస్ అయి, కార్మికులు వెంటనే విధుల్లోకి హాజరు కావాలని, లేనిపక్షంలో వారిని ఉద్యోగులుగా పరిగణించని హెచ్చరించినా కార్మికులు బేఖాతర్ చేశారు . దీంతో కార్మికులందరూ సెల్ఫ్ డిస్మిస్ అయినట్లు ప్రకటించిన ప్రభుత్వం, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల వద్ద తాత్కాలిక పద్ధతిన డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలు చేపడుతుంది.