KTR Reaction on Janwada Farmhouse incident: దీపావళి దావత్ చేసుకోవడం తప్పా? రేవ్ పార్టీ అంటూ తప్పుడు రాతలు రాస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం
కుట్రలతో తమ గొంతు నొక్కలేరన్నారు. జన్వాడ ఫామ్‌హౌస్ ఘటనపై కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘మూసీ కుంభకోణం, వందరోజుల్లో అమలు చేస్తామన్న హామీలు, బావమరిదికి ఇచ్చిన కాంట్రాక్టు వ్యవహారంతో పాటు అనేక స్కామ్‌లను బీఆర్ఎస్ (BRS) బయటపెడుతోంది
Hyderabad, OCT 27: రాజకీయంగా ఎదుర్కోలేకే తమ బంధువులపై కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR Reaction on Janwada) మండిపడ్డారు. కుట్రలతో తమ గొంతు నొక్కలేరన్నారు. జన్వాడ ఫామ్‌హౌస్ ఘటనపై కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘మూసీ కుంభకోణం, వందరోజుల్లో అమలు చేస్తామన్న హామీలు, బావమరిదికి ఇచ్చిన కాంట్రాక్టు వ్యవహారంతో పాటు అనేక స్కామ్‌లను బీఆర్ఎస్ (BRS) బయటపెడుతోంది. మా ప్రశ్నలకు రాజకీయంగా సమాధానం చెప్పలేక కుట్రలకు తెరలేపారు. మా ధైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయలేక.. మా కుటుంబ సభ్యులు, బంధువులపై కేసులు బనాయిస్తున్నారు. కుట్రలు చేసి మా గొంతునొక్కాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఉద్యమంలో అడుగుపెట్టిన రోజే చావుకు తెగించి వచ్చాం.
KTR Reaction on Jawanda Farmhouse incident
ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తేలేదు. దాదాపు 22 గంటలుగా మా బంధువుల ఇళ్లలో ప్రహాసనంలా సోదాల కార్యక్రమం కొనసాగిస్తున్నారు. నా బావమరిది రాజ్ పాకాల (Raj Pakhal) ఉంటున్న సొంత ఇంట్లో దీపావళి పండుగ సందర్భంగా దావత్ చేసుకోవడం తప్పా? గృహ ప్రవేశం సందర్భంగా బంధువులను పిలిచి దావత్ ఇచ్చారు. కొందరు రేవ్‌పార్టీ అని ఇష్టమొచ్చి మాట్లాడుతున్నారు. అసలు రేవ్ పార్టీ అంటే అర్థం తెలుసా? వృద్ధులు, చిన్న పిల్లలతో సహా కుటుంబం మొత్తం బంధుమిత్రులతో కలిసి ఉంటే దాన్ని రేవ్ పార్టీ అని ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. పార్టీలో అసలు డ్రగ్స్ దొరకలేదు. ఆ వ్యక్తి ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకున్నాడో తెలియదు. చేతనైతే రాజకీయంగా తలపడండి.. ఇచ్చిన హామీలపై దృష్టి సారించండి’’ అని కేటీఆర్ అన్నారు.