Hyderabad Rains: హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం, భారీగా ట్రాఫిక్ జామ్, తెలంగాణకు నాలుగు రోజుల పాటు వానలు, వాతావ‌ర‌ణ శాఖ కీల‌క అప్డేట్ ఇదిగో..

సిటీలోని పలు చోట్ల చిరుజల్లులతో పాటు పలు చోట్ల వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహీల్స్, గచ్చిబౌలి, పంజాగుట్ట, యూసఫ్ గూడ, మాదాపూర్ చందానగర్, మియాపూర్, కుత్బుల్లాపూర్, సూరారం, సుచిత్ర, కొంపల్లి, చింతల్, షాపూర్ ఏరియాల్లో వర్షం పడుతోంది.

Hyderabad Rains

Hyd, Nov 7: హైదరాబాద్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావారణం మారిపోయింది. సిటీలోని పలు చోట్ల చిరుజల్లులతో పాటు పలు చోట్ల వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహీల్స్, గచ్చిబౌలి, పంజాగుట్ట, యూసఫ్ గూడ, మాదాపూర్ చందానగర్, మియాపూర్, కుత్బుల్లాపూర్, సూరారం, సుచిత్ర, కొంపల్లి, చింతల్, షాపూర్ ఏరియాల్లో వర్షం పడుతోంది. చిరుజల్లులతో నగరంలోని పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే టైం కావడంతో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇండ్లకు చేరుకోవడానికి గంటల సమయం పడుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్‌ ఇచ్చింది. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, కర్నాటక, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా బాణసంచా అమ్మకాలు బ్యాన్, కాలుష్యాన్ని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన సుప్రీంకోర్టు

ఈశాన్య రుతుపవనాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. వచ్చే నాలుగు రోజులు హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, నల్లగొండ, సూర్యాపేట, నారాయణ పేట, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. మేడ్చల్‌ మల్కాజిగిరి, వరంగల్‌, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ఇక రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల సెల్సియస్‌గా పడిపోతాయన్నారు. హైదరాబాద్‌ సహా పొరుగు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప తగ్గుదలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని చెప్పారు.

కొన్ని చోట్ల మోస్తరు వర్షం పడనుండగా.. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వాన పడనున్నట్లు స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. ఆయా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే సూచనలు ఉన్నాయని.. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించింది వెదర్ డిపార్ట్ మెంట్. ఈ సూచనలు, హెచ్చరికలు రాత్రి 7 నుంచి 10 గంటల వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది. రాబోయే రెండు రోజులు.. అంటే నవంబర్ 8, 9 తేదీల్లోనూ చెదురు మదురు వర్షాలు పడతాయని స్పష్టం చేస్తూ.. పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని వెల్లడించింది.