Conditional Bail for Sharmila: వైఎస్ షర్మిలకు షరతులతో కూడిన బెయిల్, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు వైఎస్సార్‌టీపీ పిలుపు
పోలీసులతో దురుసుగా వ్యవహరించారన్న కేసులో ఆమెను సోమవారం అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Hyd, April 25: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది. పోలీసులతో దురుసుగా వ్యవహరించారన్న కేసులో ఆమెను సోమవారం అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె నిన్ననే బెయిల్ కోసం పిటిషన్ వేశారు.
అయితే.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోరిన కోర్టు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఈ ఉదయం పిటిషన్‌పై విచారణ కొనసాగగా.. షర్మిల కొట్టిందన్న వీడియోలను మాత్రమే పదే పదే చూపిస్తున్నారని, కానీ అంతకు ముందు ఆ తర్వాత ఏం జరిగిందనేది మాత్రం చూపించడం లేదని ఆమె తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
చివరకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్‌టీపీ తరపున రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు షర్మిల పిలుపు ఇచ్చారు.
చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్ షర్మిలను.. వైఎస్ విజయమ్మ మంగళవారం పరామర్శించారు. విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంటోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా? అని విజయమ్మ నిలదీశారు.