Apple Big Invest In India: ఇండియాలో ఆపిల్ రూ.7 వేల కోట్ల పెట్టుబడులు.. ! మేక్ ఇన్ ఇండియాకు తోడ్పాటు,ఆపిల్,శాంసంగ్ ప్రతినిధులతో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ భేటీ
ఇండియాలో తన మొబైల్ మార్కెట్ ( Mobile Market)ని విస్తరించేందుకు పెద్ద ఎత్తున్న ప్రణాళికలు రచిస్తోంది.
New Delhi,September 18: సిలికాన్ వ్యాలీ దిగ్గజం ఆపిల్ ఇండియాలో పెద్ద ఎత్తున బిజినెస్ ప్లాన్ చేస్తోంది. ఇండియాలో తన మొబైల్ మార్కెట్ ( Mobile Market)ని విస్తరించేందుకు పెద్ద ఎత్తున్న ప్రణాళికలు రచిస్తోంది. తయారీ రంగాన్ని చైనా ( China)నుంచి ఇండియా ( India)కు తరలించే ఆలోచనలో ఉన్నట్లుగా జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఆపిల్ (Apple) కంపెనీ ఇండియాలో సుమారుగా రూ. 7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని కేంద్ర ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ( Ravi Shankar Prasad Minister of Electronics and Information Technology) తెలిపారు. ఈ పెట్టుబడులను ఇండియాలో భాగస్వామ్యం ద్వారా ఇన్వెస్ట్ చేసేందుకు రెడీగా ఉందని ఆయన అన్నారు. ఆపిల్, డెల్, ఒప్పో, శామ్‌సంగ్, తదితర దిగ్గజ ఎలక్ట్రానిక్స్, మొబైల్ కంపెనీల సీఈవోలతో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎన్నో అంశాలు చర్చకు వచ్చాయి.
ఈ సందర్భంగా ఐటీ మంత్రి మాట్లాడుతూ దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు భారత మార్కెట్ పట్ల ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. ఐఫోన్ తయారీ సంస్థ ఆపిల్ అతి పెద్ద వ్యాపార ప్రణాళికతో ఇక్కడ విస్తరించేందుకు సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ సంస్థకు భారత్ ఎగుమతుల హబ్‌గా మారనుందన్నారు. బిజెపి హయాంలోనే భారత్‌లోని మొబైల్ ఫ్యాక్టరీలు రెండు నుంచి 268కి చేరాయని చెప్పారు.వృద్ధి అనుకూల ప్రభుత్వం, పెట్టుబడులకు అనుకూల విధానాలు, భారత మార్కెట్ బలం, నైపుణ్య మానవ వనరులు, డిజిటల్ సామర్థ్యాలు కలిగిన భారత్.. ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎగుమతుల కేంద్రంగా అవతరిస్తుందన్న నమ్మకాన్ని మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యక్తం చేశారు. 2025 నాటికి 400 బిలియన్ డాలర్ల (రూ.28.43 లక్షల కోట్లు) ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
కేవలం మొబైల్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్‌లోనే కాకుండా వ్యూహాత్మక, రక్షణ, వైద్య సంబంధిత ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్‌పైనా పెట్టుబడులు పెంచాలని మంత్రి వారికి పిలుపునిచ్చారు. భారత్‌ను అంతర్జాతీయ ఎగుమతులకు కేంద్రంగా చేసుకోవాలని రవిశంకర్ ప్రసాద్ కోరారు. ప్రభుత్వం నుంచి పరిశ్రమకు పూర్తి మద్దుతు ఉంటుందని హామీనిచ్చారు. పరిశ్రమ నుంచి ఎప్పటికప్పుడు సూచనలు తీసుకునేందుకు, వారి ఆందోళను పరిష్కరించేందుకు ఓ వ్యవస్థీకృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉంటే అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడం, మరోవైపు మన దేశ ఎగుమతులు స్తబ్దుగా ఉన్న తరుణంలో నూతన అవకాశాలను సొంతం చేసుకునే దిశగా మంత్రి ఈ సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది.