Laptop Imports Ban: కేంద్రం నిర్ణయంతో బడా టెక్ కంపెనీలకు షాక్, నిలిచిపోనున్న ఆపిల్, శాంసంగ్, హెచ్‌పీ ల్యాప్‌టాప్స్ దిగుమతులు, భారీగా ధరలు పెరిగే అవకాశం, భవిష్యత్ కార్యాచరణ ఏంటి?
ఇప్పటికే ‘మేడ్ ఇన్ ఇండియా’ పాలసీ అమలు చేస్తోంది. అయినా, గ్యాడ్జెట్ల (Gadgets) తయారీ కోసం దిగుమతులపైనే టెక్ పరిశ్రమ ఆధార పడటంతో కేంద్రం తాజాగా విదేశాల నుంచి లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతిపై (Laptop Imports) నిషేధం అమల్లోకి తెచ్చింది.
New Delhi, Aug 04: దేశీయంగా లాప్‌టాప్ లు (Laptop), టాబ్లెట్లు (Tabs), పర్సనల్ కంప్యూటర్ల తయారీని ప్రోత్సహించాలని కేంద్రం తలపెట్టింది. ఇప్పటికే ‘మేడ్ ఇన్ ఇండియా’ పాలసీ అమలు చేస్తోంది. అయినా, గ్యాడ్జెట్ల (Gadgets) తయారీ కోసం దిగుమతులపైనే టెక్ పరిశ్రమ ఆధార పడటంతో కేంద్రం తాజాగా విదేశాల నుంచి లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతిపై (Laptop Imports) నిషేధం అమల్లోకి తెచ్చింది. దీనివల్ల గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థలు ఆపిల్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో, హెచ్‌పీ ఇంక్ తదితర సంస్థల నుంచి భారీ స్థాయిలో భారత్‌లోకి లాప్ టాప్‌లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతులు నిలిచిపోతాయన్న అభిప్రాయం వినిపిస్తున్నది. లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్లను, వాటి విడి భాగాలను దిగుమతి చేసుకోవాలన్నా సంబంధిత సంస్థలకు లైసెన్స్ ఉండాలన్న నిబంధన కూడా కేంద్రం తీసుకొచ్చింది. స్థానికంగా ఉత్పత్తిని పెంచడానికి, దిగుమతులపై ఆధారపడకుండా కేంద్రం కొన్ని చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వస్తువుల దిగుమతికి లైసెన్సింగ్ నిబంధన వల్ల పరిశ్రమ ఇబ్బందుల్లో పడుతుందని ఆయా సంస్థల ప్రతినిధులు అంటున్నారు.
త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుండటంతోపాటు కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు త్వరితగతిన లైసెన్సులు పొందడానికి టెక్ సంస్థలన్నీ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. పండుగల సీజన్ తోపాటు విద్యార్థుల బ్యాక్ టు స్కూల్ విధానం తిరిగి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆపిల్ వంటి సంస్థలు విదేశాల నుంచి భారత్‌లోకి వస్తువుల దిగుమతికి లైసెన్సు తీసుకుంటాయా? అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. లైసెన్సు తీసుకోవడం వల్ల ఆయా లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల ధరలు పెరిగే అవకాశాలు లేకపోలేదు.
కానీ, తాజా నిషేధం వల్ల కీలక సమయంలో విదేశీ పర్సనల్ కంప్యూటర్ల దిగుమతిపై నిషేధం వల్ల వందల కోట్ల రూపాయల వ్యాపారంలో ఒడిదొడుకులు నెలకొంటాయని టెక్ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. టెక్నాలజీ రంగంలో ‘మేడ్ ఇన్ ఇండియా’ స్కీంలో భాగంగా రూ.17 వేల కోట్ల విలువైన ఇన్సెంటివ్‌ల పాలసీని కేంద్రం తీసుకొచ్చింది. ఇందుకోసం టెక్ సంస్థల నుంచి దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తున్నది.