RIL AGM 2020: తక్కువ ధరకే జియో నుంచి 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్లు, ఏజీఎంలో వెల్లడించిన ముఖేష్ అంబానీ, గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం
అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ భాగస్వామ్యంలో అందరికి ఆమోదయోగ్యమైన 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్లను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ( mukesh ambani) తెలిపారు.
New Delhi, July 15: నేడు జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారుల 43వ వార్షిక సమావేశం (AGM)లో ముఖేష్ అంబానీ పలు సంచలన నిర్ణయాలు ప్రకటించారు. అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ భాగస్వామ్యంలో అందరికి ఆమోదయోగ్యమైన 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్లను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ( mukesh ambani) తెలిపారు.
జియో 4జీ స్మార్ట్‌ఫోన్లను (Jio 4G Smartphones) అందుబాటులోకి తెచ్చేందుకు నిబద్దతను కలిగి ఉంది. ఈరోజు వరకు 10 కోట్ల జియోఫోన్లను (Jio Phones) విక్రయించాము. గూగుల్‌తో (Google) వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా అందుబాటు ధరల్లో ఎంట్రీ లెవల్ 4జీ, 5జీ ఫోన్లను (Entry Level Phones) తయారీ చేయగలమని నమ్ముతున్నాం’’ అని తెలిపారు.
ఇప్పటికీ 35కోట్ల మంది 2జీ స్మార్ట్‌ఫోన్లను (2G Smartphones) వినియోగిస్తారని, వారి దృష్టిలో ఉంచుకొని చౌకధరల్లో స్మార్ట్‌ఫోన్ తయారీకి సిద్ధమైనట్లు ముకేశ్ ఈ సందర్భంగా తెలిపారు. జియో, గూగుల్ సంయుక్త భాగస్వామ్యంలో తయారీ అయ్యే 4జీ, 5జీ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ప్లే స్టోర్‌ను ఆప్టిమైజ్ చేసుకోనే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మొబైల్ రంగంలో 5జీ సేవలను త్వరలో ప్రారంభించనున్నట్లు ఇవాళ రిలయన్స్ సంస్థ చైర్మన్ ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. ప్రపంచ ఆరవ కుబేరుడు ముకేష్ అంబానీ, కొత్త వినియోగదారులతో దూసుకుపోతున్న రిలయన్స్ జియో, బ్లూజీన్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన ఎయిర్‌టెల్
వచ్చే ఏడాది నుంచి ప్రయోగాత్మకంగా 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. అయితే భారతీయ కస్టమర్లను దృష్టిలో పెట్టుకున్న జియో సంస్థ.. త్వరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కూడా డెవలప్ చేయనున్నది. గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న జియో.. 5జీ ఫోన్‌ను డిజైన్ చేసి మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు ముఖేశ్ తెలిపారు. ఇవాళ ఏజీఎమ్‌ను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు.
భారత్‌లో ఎక్కువ స్థాయిలో ఫీచర్ ఫోన్ యూజర్లు ఉన్నారని, వారంత తక్కువ ధరకే వచ్చే స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ కావాలనుకుంటున్నారని ముఖేశ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే గూగుల్‌తో కలిసి 4జీ లేదా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఆ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయగలమన్నారు. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను గూగుల్‌తో కలిసి డెవలప్ చేయనున్నట్లు ముఖేశ్ వెల్లడించారు. జియో-గూగుల్ బంధం.. భారత్‌కు 2జీ నుంచి విముక్తి కల్పిస్తుందన్నారు. దేశంలో సుమారు 35 కోట్ల మంది 2జీ ఫీచర్ ఫోన్‌ను వాడుతున్నారని, వారికి సరసమైన ధరలోనే స్మార్ట్‌ఫోన్ అందిస్తామన్నారు.
ఇటీవల పలు విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకట్టుకుంటున్న జియో ప్లాట్‌ఫామ్స్ తాజాగా టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ను సైతం ఆకర్షించింది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు డిజిటల్, టెలికం విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్ రూ. 33,737 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తాజాగా ముకేశ్ అంబానీ వెల్లడించారు. తద్వారా రిలయన్స్ జియోలో 7.7 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేశారు. గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా అందుబాటు ధరల్లో 4జీ/5జీ ఫోన్లను తయారు చేనున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా దేశీ వినియోగం కోసం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించనున్నట్లు వివరించారు.
ఇదిలా ఉంటే రానున్న 5-7 ఏళ్ల కాలంలో దేశీయంగా 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే ప్రణాళిల్లో ఉన్నట్లు సోమవారం గూగుల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తద్వారా డిజిటల్ టెక్నాలజీస్‌లో మరింత విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం యథాతథంగా రూ. 1918 వద్ద ట్రేడవుతోంది. తొలుత 2.2 శాతం ఎగసి రూ. 1989 సమీపానికి చేరింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం!
పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కంపెనీ ఆర్‌ఐఎల్‌కు అనుబంధ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో చివరిగా చిప్ దిగ్గజం క్వాల్‌కామ్ రూ. 730 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. తద్వారా జియోలో 0.15 శాతం వాటాను సొంతం చేసుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 25.24 శాతం వాటాను విక్రయించడం ద్వారా ఇప్పటికే ఆర్‌ఐఎల్ రూ. 1.18 లక్షల కోట్లకుపైగా సమీకరించింది. జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌సహా చిప్ దిగ్గజాలు ఇంటెల్, క్వాల్‌కామ్.. పీఈ సంస్థలు కేకేఆర్, సిల్వర్ లేక్ తదితరాలు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే.
ఈ పెట్టుబడులకు జతగా రైట్స్ ఇష్యూ ద్వారా ఆర్‌ఐఎల్ రూ. 53,124 కోట్లను సమకూర్చుకుంది. ఈ బాటలో గతేడాది ఇంధన రిటైల్ నెట్‌వర్క్‌లో 49 శాతం వాటా అమ్మకం ద్వారా బీపీ నుంచి రూ. 7,000 కోట్లు సమీకరించింది. వెరసి నికరంగా రుణరహిత కంపెనీగా ఆవిర్భవించినట్లు గత నెలలో ఆర్‌ఐఎల్ తెలియజేసింది. మార్చికల్లా ఆర్‌ఐఎల్ రుణ భారం రూ. 1.6 లక్షల కోట్లుగా నమోదైన సంగతి తెలిసిందే.