
Vjy, Feb 28: ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual Keshav) 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.48వేల కోట్లు కేటాయించారు.
రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు. అన్నదాత సుఖీభవ కోసం రూ.6,300 కోట్లు, ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ.6,705 కోట్లు కేటాయించారు.సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు.
అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇచ్చేలా కేటాయింపులు చేశారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తించనుంది. 1-12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీం వర్తించనుంది. విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం జమచేయనుంది. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం పయ్యావుల మాట్లాడుతూ.. రాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుందని.. అప్పు తీసుకొనే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందని అన్నారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు స్ఫూర్తితో బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. 2014-19 మధ్య రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించిందన్నారు. సవాళ్లను ఎదుర్కోవడంలో చంద్రబాబు.. ఆయనకు ఆయనే సాటి అని అన్నారు.
రాష్ట్ర విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన ఏపీకి అమరావతిని ప్రజా రాజధానిగా చేసుకున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి పనులు పెద్దఎత్తున చేపడతామని చెప్పారు. మహారాష్ట్రకు ముంబయి, తెలంగాణకు హైదరాబాద్ ఎంత ముఖ్యమో.. మనకూ అమరావతి అంతే ముఖ్యమన్నారు. ప్రధాని మోదీ సహకారంతో ముంబయి, హైదరాబాద్ నగరాలకు సరితూగేలా అమరావతిని అభివృద్ధి చేస్తామని పయ్యావుల వెల్లడించారు.
ఈ ఏడాదిలోనే రూ. 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలులోకి రానుంది. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్టు బడ్జెట్‌లో మంత్రి వెల్లడించారు.ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చేనేతలకూ ఉచిత విద్యుత్ అమలు చేయనున్నారు. చేనేత మగ్గాలపై ఆధారపడే వారికి 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ కేటాయించనుంది ప్రభుత్వం. అలాగే మరమగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించనున్నారు.
నాయీ బ్రహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం అందించేలా బడ్జెట్‌లో ప్రస్తావించారు. వృద్ధుల సంరక్షణ కోసం 12 వృద్ధాశ్రామాలు నిర్మించాలని నిర్ణయించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయి. టిడ్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్టులో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఇళ్ల నిర్మాణం నిమిత్తం ఎస్సీలకు అదనంగా రూ. 50 వేలు, ఎస్టీలకు అదనంగా రూ. 75 వేలు ఇవ్వనున్నట్టు బడ్జెట్టులో వెల్లడించారు.
చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీపం 2.0 కింద నిధుల కేటాయింపు కేటాయించనున్నారు. అలాగే ఆదరణ పథకాన్ని కూటమి ప్రభుత్వం పునః ప్రారంభించింది.
ఏపీ బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా
నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ.1,228 కోట్లు
పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు
ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు
ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు
ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు
బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు
అల్పసంఖ్యాక వర్గాల కోసం రూ.5,434 కోట్లు
మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ.4,332 కోట్లు
వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖకు రూ.18,847 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.13,862 కోట్లు
గృహ నిర్మాణ శాఖకు రూ.6,318 కోట్లు
జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు
ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు
ఆర్‌అండ్‌బీకి రూ.8,785 కోట్లు
యువజన, పర్యటక, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు
గృహ మంత్రిత్వ శాఖకు రూ.8,570 కోట్లు
తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు
మద్యం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు
జల్ జీవన్ మిషన్ కోసం రూ.2,800 కోట్లు
వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు
తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు (2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు)
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం రూ.27,518 కోట్లు
ఆర్టీజీఎస్ కోసం రూ.101 కోట్లు
దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు
మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు
స్వచ్ఛాంధ్ర కోసం రూ.820 కోట్లు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు
ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు