Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయాణంలో మరో కీలక ఘట్టం.. భూ కక్ష్యను వీడి చంద్రుడి దిశగా చంద్రయాన్-3 ప్రయాణం ప్రారంభం
18 రోజులుగా భూకక్ష్యల్లో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 మంగళవారం చంద్రుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.
Newdelhi, Aug 1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) (ISRO) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయాణంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. 18 రోజులుగా భూకక్ష్యల్లో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 మంగళవారం చంద్రుడి (Moon) దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ఈ వ్యోమనౌకను ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ‘‘చంద్రయాన్-3 విజయవంతంగా భూ కక్ష్యలను పూర్తి చేసుకుని చంద్రుడివైపు వెళుతోంది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్కింగ్‌లో పేరిజీ-ఫైరింగ్ దశ పూర్తయింది. దీన్ని విజయవంతంగా ట్రాన్స్ లూనార్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టాము, తదుపరి లక్ష్యం చంద్రుడి కక్ష్యలోకి వెళ్లడమే’’ అని ఇస్రో పేర్కొంది.
ఆగస్టు 23న జాబిల్లిపై..
ఇస్రో ప్రణాళిక ప్రకారం ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనున్న చంద్రయాన్ -3, ఆగస్టు 23న జాబిల్లిపై దిగనుంది. ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్‌తో కూడిన చంద్రయాన్-3 జులై 14న శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయాణం ప్రారంభించింది.