Chandrayaan 3 Update: విక్రమ్ ల్యాండర్ పంపిన లేటెస్ట్ ఫోటోలు ఇవిగో, మరి కొద్ది గంటల్లో చందమామపై దిగనున్న ల్యాండర్, ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా..
మరికొద్ది గంటల్లో మన విక్రమ్ ల్యాండర్..చందమామ (Moon) దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది.
కోట్లాది మంది భారతీయులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న చారిత్రక క్షణాలు చేరువయ్యాయి. మరికొద్ది గంటల్లో మన విక్రమ్ ల్యాండర్..చందమామ (Moon) దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది. జులై 14న శ్రీహరికోటలోని షార్ ప్రయోగ వేదిక నుంచి రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 (Chandrayaan-3).. బుధవారం (ఆగస్టు 23) సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ కానున్నట్లు ఇస్రో ఇప్పటికే వెల్లడించింది.
అన్ని అనుకూలిస్తే రేపు సాయంత్రం జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ కాలుమోపనుంది. ఆ తర్వాత రెండు వారాల పాటు ల్యాండర్, రోవర్ చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు సాగిస్తాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత జాబిల్లిపై కాలుమోపిన నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది. ఇక, దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా సరికొత్త చరిత్రను లిఖించనుంది.
ప్రస్తుతం చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశం కోసం విక్రమ్ ల్యాండర్ అన్వేషణ కొనసాగిస్తోంది. 70 కిలోమీటర్ల దూరం నుంచి జాబిల్లి ఫొటోలను ల్యాండర్ తన కెమెరాలో బంధించింది. ఈ ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ట్విట్టర్ (ఎక్స్)లో పోస్టు చేసింది. విక్రమ్ ల్యాండర్‌కు అమర్చిన ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా (Lander Hazard Detection and Avoidance Camera) ఈ ఫొటోలను తీసినట్లు తెలిపింది.
Here's ISRO Tweet
మిషన్ షెడ్యూల్‌లో ఉందని.. సిస్టమ్‌లు క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నట్లు పేర్కొంది. సున్నితమైన సెయిలింగ్ కొనసాగుతోందని తెలిపింది. చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారం రేపు సాయంత్రం 5:20 గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడించింది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ (Vikram lander) చంద్రుడిపై అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే.
తొలుత ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు సాఫ్ట్‌ల్యాండింగ్ చేయాలని ఇస్రో నిర్ణయించింది. అయితే ఈ సమయంలో మార్పు చేశారు. 17 నిమిషాలు ఆలస్యంగా సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ను చంద్రుడిపై దించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇస్రో (Indian Space Research Organisation) ట్విట్టర్ ద్వారా ఇప్పటికే వెల్లడించింది. మరోవైపు చంద్రయాన్-3కి పోటీగా రష్యా ప్రయోగించిన లూనా-25 ప్రయోగం విఫలమవడంతో ఇప్పుడు అందరి కళ్లూ చంద్రయాన్-3పైనే ఉన్నాయి.