CMFRI Lab-grown Fish Meat: ప్రయోగశాలలో చేప మాంసం తయారీ.. దేశంలోనే తొలిసారిగా అభివృద్ధి చేస్తున్న సీఎంఎఫ్‌ఆర్‌ఐ
ఇప్పటికే పలు దేశాల్లో ఈ దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి.
Newdelhi, Jan 30: ప్రయోగశాలలో చేప మాంసం (Fish meat in lab) తయారు చేసే దిశగా కేరళలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) (CMFRI) పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. ఇప్పటికే పలు దేశాల్లో ఈ దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే తొలిసారి భారత్ లో సీఎంఎఫ్‌ఆర్‌ఐ పరిశోధకులు ల్యాబ్ లో చేప మాంసాన్ని అభివృద్ధి చేస్తున్నారు. చేపల నుంచి సేకరించిన కొన్ని ప్రత్యేక కణాలను ల్యాబ్ లో అభివృద్ధి చేసి చేప మాంసాన్ని ఉత్పత్తి చేస్తామని సీఎంఎఫ్‌ఆర్‌ఐ చెబుతున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ల్యాబ్ ను ఏర్పాటు చేయనున్నారు. కృత్రిమంగా తయారు చేసిన చేప మాంసం నిజమైన మాంసం రుచికి ఏమాత్రం తీసిపోదని పరిశోధకులు చెబుతున్నారు.
ఏ చేపల మాంసాన్ని తయారు చేస్తారంటే?
తొలుత కింగ్ ఫిష్, చందువాయి చేప, సీర్ ఫిష్ మాంసాన్ని అభివృద్ధి చేస్తామని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రయోగశాలలో చేప మాంసాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణ, ఆహార భద్రత ప్రయోజనాలను పొందొచ్చని, అంతేగాక సముద్ర జీవుల సమతౌల్యాన్ని సంరక్షించొచ్చని వాళ్లు చెబుతున్నారు.